జొమాటో (Zomato) వ్యవస్థాపకుడు దీపిందర్ గోయిల్ (Deepinder Goyal) ఎటర్నల్ గ్రూప్ (Eternal Group) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) (CEO) పదవికి రాజీనామా (Resignation) చేస్తున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం వాటాదారుల ఆమోదానికి లోబడి ఉండగా, ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్‌కు సమాచారం ఇచ్చింది.
వాటాదారులకు రాసిన లేఖలో దీపిందర్ గోయిల్ తన నిర్ణయానికి గల కారణాలను వివరించారు. ఇటీవల తాను అధిక రిస్క్‌తో కూడిన, ప్రయోగాత్మక స్వభావం కలిగిన కొత్త ఆలోచనల వైపు ఆకర్షితుడవుతున్నానని తెలిపారు. అలాంటి ఆలోచనలు పబ్లిక్ కంపెనీ పరిమితులకు వెలుపల ఉంటేనే సమర్థంగా అమలు చేయవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
పబ్లిక్ కంపెనీ అయిన ఎటర్నల్‌కు సంబంధించిన బాధ్యతలు పూర్తిస్థాయి నిబద్ధతను కోరుకుంటాయని, అదే సమయంలో సంస్థలో కొనసాగుతూ బయట కొత్త ఆలోచనలను అన్వేషించడానికి కావాల్సిన వ్యక్తిగత సమయం తనకు లభించడం లేదని గోయిల్ స్పష్టం చేశారు. సంస్థ ప్రస్తుత వ్యాపార నమూనాతో పాటు కొత్త వృద్ధి అవకాశాలను అన్వేషించాలంటే పూర్తి దృష్టి, క్రమశిక్షణ అవసరమని అన్నారు.
బోర్డులో వైస్ చైర్మన్‌గా గోయిల్
సీఈవో పదవి నుంచి తప్పుకున్నప్పటికీ, దీపిందర్ గోయిల్ ఎటర్నల్ డైరెక్టర్ల బోర్డులో వైస్ చైర్మన్‌గా కొనసాగనున్నారు. గత 18 సంవత్సరాలుగా సంస్థ నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశానని, ఇకపై కూడా అదే నిబద్ధతతో సంస్థ అభివృద్ధికి తోడ్పడతానని తెలిపారు. సంస్థలోని అన్ని వ్యాపార విభాగాల సీఈవోలు ఇప్పటివరకు ఉన్న స్వతంత్రతతోనే పనిచేస్తారని ఆయన స్పష్టం చేశారు.
నూతన సీఈవో అల్బిందర్ ధిండ్సా !
ఎటర్నల్ గ్రూప్ నూతన సీఈవోగా బ్లింకిట్ వ్యవస్థాపకుడు, ప్రస్తుత సీఈవో అయిన అల్బిందర్ ధిండ్సా బాధ్యతలు స్వీకరించనున్నారు. సంస్థ రోజువారీ కార్యకలాపాలు, ఆపరేటింగ్ ప్రాధాన్యతలు, కీలక వ్యాపార నిర్ణయాల అమలు ఆయన ఆధ్వర్యంలో కొనసాగనున్నాయి.








