వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి దర్శనం టోకెన్ల జారీలో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరింది. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల పంపిణీలో తొక్కిసలాట చోటుచేసుకుని ఏడుగురు మృతి చెందారని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, పదుల సంఖ్యలో భక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం.
ఈ సంఘటనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భక్తుల ఆరోగ్య పరిస్థితి విషమం ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం రుయా ఆస్పత్రిని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
నిన్న(బుధవారం) రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా గేట్లు తెరవడంతో భక్తజనం టోకెన్ల కోసం దూసుకెళ్లారు. క్యూలెన్ల నిర్వహణలో అధికారులు చేతులెత్తేశారు. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే భక్తులు ప్రాణాలు కోల్పోయారని వారి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తగిన సాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మృతదేహాలకు రుయా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.