దళిత సర్పంచ్ పూరిగుడిసె దహనంపై వైసీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు అసెంబ్లీ పరిధిలోని ఉలిచిగ్రామంలో జరిగిన దళిత సర్పంచ్ కనుమూరి మహాలక్ష్మికి చెందిన గుడిసెకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. దీంతో గుడిసె పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై వైసీపీ తీవ్రంగా స్పందించింది.
రాజకీయ కక్షతో దళిత సర్పంచ్‌ను టార్గెట్ చేశారు
ఈ సందర్భంగా కనకారావు మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. మహాలక్ష్మి పూరి గుడిసె తగలబెట్టడంలో రాజకీయ కక్ష స్పష్టంగా కనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. పూరి గుడిసెతో పాటు పొగాకు నారు మూటలు, ఎరువులు దగ్ధమవడంతో మూడు లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని వివరించారు.
దళితుల సంక్షేమాన్ని విస్మరిస్తూ..
వైసీపీపై అపోహలు సృష్టించి అధికారంలోకి వచ్చిన టీడీపీ, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దళితుల హక్కులను కాలరాస్తోందన్నారు. గత ఆరు నెలల్లో ఐదుగురు దళితులు మరణించడమే కాకుండా, దాదాపు 500 పైగా దళిత మహిళలు దాడులకు గురయ్యారన్నారు.
పోలీసుల నిర్లక్ష్యం – నష్టపరిహారం ఇవ్వాలి
ఘటన జరిగి 48 గంటలు గడుస్తున్నా, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని కనకారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత సర్పంచ్‌కు జరిగిన ఆస్తి నష్టానికి తగిన పరిహారం ప్రభుత్వం అందించాలని, బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.