తమిళనాడు (Tamil Nadu)లోని కడలూరు (Cuddalore) జిల్లాలోని చెమ్మంగుప్పం (Chemmanguppam) రైల్వే క్రాసింగ్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Train Accident) చోటుచేసుకుంది. రైలు స్కూల్ బస్సు (School Bus)ను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఒక చిన్నారితో సహా ముగ్గురు మృతి (Death) చెందారు. బస్సులో మరో నలుగురు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో వ్యాన్‌లో ఐదుగురు విద్యార్థులు, ఇద్దరు వాహన సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో స్కూల్ వ్యాన్ నుజ్జునుజ్జు అయ్యింది. రైలు వేగంగా ఢీ కొట్టడంతో బస్సు 50 మీటర్ల దూరం ఎగిరి పడినట్లు అధికారులు తెలిపారు.
ప్రమాదానికి ప్రధాన కారణం రైల్వే గేట్ వద్ద నిర్లక్ష్యంగా వ్యవహరించిన గేట్ మ్యాన్ (Gate Man) గేట్‌ను మూసివేయకపోవడమేనని ప్రాథమిక విచారణలో తేలింది. రైలు వేగంగా రాకపోకలు సాగిస్తున్న సమయంలో స్కూల్ బస్సు రైల్వే క్రాసింగ్‌ను దాటేందుకు ప్రయత్నించగా, రైలు ఢీకొనడంతో బస్సు బాగా దెబ్బతిని, ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నలుగురు చిన్నారులను వెంటనే కడలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ దుర్ఘటనపై స్థానిక పోలీసులు విచారణ జరుపుతున్నారు, రైల్వే అధికారులు గేట్ మ్యాన్ నిర్లక్ష్యంపై దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు, స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రైల్వే క్రాసింగ్‌ల వద్ద తగిన భద్రతా చర్యలు లేకపోవడమే ఈ విషాదానికి కారణమని ఆరోపిస్తున్నారు. కడలూరు జిల్లా పోలీసులు, రైల్వే అధికారులు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.