దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. డీఎంకే ఆధ్వర్యంలో తమిళనాడులో అఖిలపక్ష సమావేశం నిర్వహించగా, ఈ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధినేత మహేశ్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నేత కేటీఆర్, కేరళ సీఎం పినరయ్ విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. “బీజేపీ దక్షిణాది రాష్ట్రాలను అణచివేసేందుకు కుట్రలు చేస్తోంది. మన రాష్ట్రాల భవిష్యత్తును ఇతరులు నిర్ణయించడం సబబేనా?” అంటూ కేంద్రంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది ప్రజల ప్రాతినిధ్యాన్ని తగ్గించే విధంగా ఉందని, చట్టాల రూపకల్పనలో దక్షిణాది రాష్ట్రాల వాణి ఆవిష్కరించేందుకు అవరోధంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వాతంత్ర్యం కోసం అన్ని వర్గాల ప్రజలు పోరాడారని, దేశం ఒక్కరి ఆధిపత్యానికి లోనవ్వదని స్పష్టంచేశారు. “డీలిమిటేషన్‌ను పూర్తిగా వ్యతిరేకించడం లేదు. కానీ, ఇది పారదర్శకంగా, సమన్యాయంగా ఉండాలి” అని స్టాలిన్ డిమాండ్ చేశారు. బీజేపీ పాలన దక్షిణాది సంస్కృతి, ప్రగతికి ముప్పుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వివాదంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుండగా, భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు ఎలా మారనున్నాయో చూడాలి.








