రాగద్వేషాలు లేకుండా పాలన చేస్తామని రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు చేసిన ప్రకటన యావత్ దేశ ప్రజలను నిశ్చేష్టులను చేసింది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తాను ఒక పార్టీ వారికి మాత్రమే ప్రతినిధిని అన్నట్లుగా మాట్లాడిన తీరు ఆంధ్రరాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
శనివారం గంగాధర నెల్లూరులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివక్షపూరిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మద్దతుదారులకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి పనులు చేయొద్దు.. అలా చేస్తే పాముకు పాలుపోసినట్లే అని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఇలా ఒక వర్గం వారికి పనిచేయకూడదు అని బహిరంగంగా మాట్లాడడం తీవ్ర ఆక్షేపణీయం. కాగా, చంద్రబాబు కామెంట్స్‌పై రాజకీయ విశ్లేషకులు, ఏపీ ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజ్యాంగ బద్దంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆలోచన విధానమే ఇలా ఉంటే.. ఇక ఆ పార్టీలోని కింద స్థాయి నాయకులు తీరు ఇంకెలా ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక వర్గానికి మాత్రమే ముఖ్యమంత్రిగా తాను ఎన్నికైనట్లుగా వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.







