మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పట్ల కూటమి ప్రభుత్వం వైఖరి విమర్శలకెక్కుతోంది. వరుస సంఘటనలు కక్షసాధింపు రాజకీయాలను బయటపెడుతున్నాయి. పెద్దిరెడ్డి గన్‌మెన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం చూపించిన కారణం విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లిక్కర్ కేసులో అరెస్టు అయ్యి రాజమండ్రి జైలులో ఉన్న రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డిని కలవడానికి పెద్దిరెడ్డి రాజమండ్రికి వెళ్లిన సందర్భంలో చోటుచేసుకున్న ఘటన దీనికి కారణమైంది.
జూలై 23న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోర్టు అనుమతితో తన కుమారుడు మిథున్‌రెడ్డికి తలదిండు, ఆహార పదార్థాలు, మెడిసిన్ అందించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకు వెళ్లారు. కాగా, ఇటీవల చేయి విరిగిన రామచంద్రారెడ్డికి వాటిని మోసే అవకాశం లేక, ఆయన గన్‌మెన్ కాలేషానే వాటిని మోయాల్సి వచ్చింది. ఇది గన్‌మెన్ విధుల్లో భాగం కాదని చెప్పుతూ, చిత్తూరు ఎస్పీ ఆయనను సస్పెండ్ చేశారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గన్‌మెన్‌ను సస్పెండ్ చేయడం, అందుకు వివరించిన కారణం సిల్లీగా ఉందంటూ వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట్నుంచి పెద్దిరెడ్డి కుటుంబానికి, చంద్రబాబుకు సరిపోదు అన్న విషయం బహిరంగ రహస్యమే. మరీ ఇంత చిన్న రీజన్‌కు సస్పెండ్ చేయడం.. అక్కసు బయటపడకుండా కాస్త పెద్ద కారణం వెతకొచ్చుగా అని వైసీపీ శ్రేణులు వ్యంగ్యంగా సలహా ఇస్తున్నారు.
సస్పెండ్‌కు గురైన గన్‌మెన్ కాలేషా స్వస్థలం పులిచెర్ల మండలంలోని కళ్లూరు గ్రామం, ఆయన ఏఆర్ కానిస్టేబుల్‌గా పెద్దిరెడ్డి వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. ఇదే ఎస్పీ గతంలో, పుంగనూరు ఘటనలో మిథున్‌రెడ్డి గన్‌మెన్ భాస్కర్‌ను కూడా సస్పెండ్ చేసిన విషయం గుర్తు చేస్తూ, వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అప్పట్లో టీడీపీ కార్యకర్తలు ఎంపీ మిథున్‌రెడ్డి ఇంటిని చుట్టుముట్టి రాళ్లతో దాడి చేసిన సమయంలో భాస్కర్ గాల్లోకి కాల్పులు జరిపారు. భద్రతా చర్యగా చేసిన ఈ చర్యపై కూడా అప్పట్లో ఆయనపై వేటు పడింది.
“విధినిర్వహణలో తప్పులు చేస్తే మందలిస్తారు. కానీ, తలదిండు మోయడం నేరమా? గన్‌మెన్ కుటుంబం మీద కక్ష సాధింపు ఎందుకు?” అని వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. పెద్దిరెడ్డి కుటుంబంపై ప్రభుత్వం అక్కసుతో ఇలా వ్యవహరిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. ఈ చర్యలు పోలీసు వ్యవస్థను రాజకీయాలకు వాడుకుంటుందని అభివర్ణిస్తున్నారు.