కూటమి రెండేళ్ల పాలనలో రాష్ట్రం అస్తిపంజరం.. – బొత్స ధ్వజం!

కూటమి రెండేళ్ల పాలనలో రాష్ట్రం అస్తిపంజరం.. - బొత్స ధ్వజం!

Summarize with AI

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై (Alliance Government) వైసీపీ(YSRCP) సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం విశాఖలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. గత రెండేళ్ల కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాన్ని పూర్తిగా అస్తిపంజరంగా (Skeleton) మార్చేశారని, దీనికి రిపేర్లు చేయడం కూడా చాలా కష్టమని మండిపడ్డారు. చంద్రబాబు ప్రసంగాలన్నీ అభూతకల్పనలని, ఆయన అబద్ధాలు చెప్పి, ప్రజలను మాయ చేసి అధికారంలోకి వచ్చారనే విషయం అందరికీ తెలుసని ధ్వజమెత్తారు.

సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ?
ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం పూర్తిగా తుంగలోకి తొక్కిందని బొత్స సత్యనారాయణ ఆరోపించారు. “ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ (Super Six) హామీలు ఏమయ్యాయి? నిరుద్యోగులకు భృతి ఇచ్చారా? మహిళలకు (Women) నెలకు రూ. 1500 అందించారా? ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు (Free Gas Cylinders) ఎక్కడ ఇచ్చారు?” అని ప్రశ్నించారు. ప్రస్తుతం నిత్యావసర ధరలు (Essential Commodity Prices) విపరీతంగా పెరిగిపోయాయని, పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయమంటే బడ్జెట్ లేదంటూ యుద్ధం ప్రకటిస్తున్నారని విమర్శించారు. కోవిడ్ (COVID-19) లాంటి అత్యంత క్లిష్ట సమయంలోనూ తాము సుపరిపాలన అందించామని, కావాలంటే గ్రామాల్లోకి వెళ్లి ప్రజలను అడగాలని సవాల్ విసిరారు.

గీతం కోసం ఏయూని తాకట్టు పెడుతున్నారు!
విశాఖపట్నంలోని (Visakhapatnam) విద్యాసంస్థల వ్యవహారాలపై బొత్స తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెరిట్ వచ్చిన ప్రతి విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీ (AU) లో చదవాలని అనుకుంటారని, కానీ ఈ ప్రభుత్వం ఏయూని తాకట్టు పెట్టి ‘గీతం’ (GITAM) సంస్థల అభివృద్ధికి పనిచేస్తోందని, గీతం భూములను ఎలా దోచుకుంటున్నారో అందరికీ తెలుసని ఆరోపించారు.

“విద్యాశాఖ మంత్రి తన సొంత శాఖను వదిలేసి మిగతా శాఖల గురించి మాట్లాడుతున్నారు. విద్యార్థులకు ఇచ్చే విద్యా కానుక కిట్లను పేరెంట్స్ మీటింగ్‌లో ఇస్తామని వాయిదా వేశారు కానీ, ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. మెగా డీఎస్సీ (Mega DSC) విషయంలో గత విధానాన్ని ఎందుకు రద్దు చేశారు? ఇప్పుడు డీఎస్సీలో లీకేజీ వ్యవహారాలు ఏంటి? దీనిపై పత్రికల్లో వార్తలు వస్తున్నా మంత్రిత్వ శాఖ, పోలీసులు ఏం చేస్తున్నారు?” అని నిలదీశారు.

పిల్లల్ని కని ఏం చేయాలి?
చంద్రబాబు జనాభా నియంత్రణ, ఎక్కువ మంది పిల్లల్ని కనడంపై చేస్తున్న వ్యాఖ్యలను బొత్స తీవ్రంగా తప్పుపట్టారు. “రాష్ట్రంలో ఉన్న పిల్లలకే ఉద్యోగాలు లేవు.. ఇంకా పిల్లల్ని కని ఏం చేయాలి? అందరూ చంద్రబాబులా రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లు సంపాదించే మంత్రం ఏదైనా ఉంటే చెప్పండి, ప్రజలు కూడా నేర్చుకుంటారు. కేవలం తన ప్రాపకం కోసమే చంద్రబాబు పిల్లల్ని కనమని చెప్తున్నారు. ఆయన చెబుతున్న P4 (పీ4) విధానానికి రాష్ట్రంలో దిక్కూదివాణం లేదు, అంతా తప్పుడు ప్రచారమే” అని ఎద్దేవా చేశారు. ఉద్యోగులకు పీఆర్సీ (PRC) కమిషన్ వేసే దిక్కు కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు.

ప్రతీ మంగళవారం అప్పులే!
రాష్ట్రంలో క్షేత్రస్థాయి ఆఫీసుల్లో విచ్చలవిడితనం పెరిగిపోయిందని, అధికారులు, అధికార పార్టీ నాయకులు కలిసి విచ్చలవిడిగా దోచుకుంటున్నారని బొత్స ఆరోపించారు. “ప్రతీ మంగళవారం అప్పులు తీసుకురావడం, ఆ డబ్బుతో అవినీతి చేయడమే ఈ ప్రభుత్వ పనిగా మారింది. అమరావతిలో విపరీతమైన అవినీతి జరుగుతోంది. విశాఖపట్నం ప్రాంతం అభివృద్ధికి మంచిదని నాడు జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) అభిప్రాయపడితే.. మా వైజాగ్ ప్రతిపాదనపై ఎందుకంత ఉలికిపాటు?” అని ప్రశ్నించారు. వ్యవసాయాన్ని చంద్రబాబు పూర్తిగా వదిలేశారని, పంట పండినా కొనేవారు లేక రైతుల ఇబ్బందులు వర్ణణాతీతంగా ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీలో వైద్యం అందడం లేదని, ఆరోగ్య కేంద్రాల్లో మందులు లేవని, ఉపాధి హామీలో జరుగుతున్న మోసాలపై సాక్ష్యాలతో సహా ప్రభుత్వానికి లేఖ రాశానని తెలిపారు.

ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావుపై కేసులా?
ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్‌రావుపై జరుగుతున్న పరిణామాలపై బొత్స స్పందిస్తూ.. “ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన దృష్టికి వచ్చిన విషయాన్ని ఆయన చెప్పారు. రేపు నా దృష్టికి వస్తే నేను కూడా చెబుతాను. దానికి పోలీస్ కేసులు పెడతారా? తప్పు అయితే ఖండించండి అంతే తప్ప కేసులా? చంద్రబాబు కంటే పెద్ద మోసగాడు ఎవరైనా ఉన్నారా? తెలుగుదేశం పార్టీకి ‘మాయ, మోసం, దగా పార్టీ’ అని పేరు పెట్టాలి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన నిలబడి కూటమి ప్రభుత్వ మోసాలను ప్రశ్నిస్తూనే ఉంటామని, వారి చొక్కా విప్పి ప్రజల మధ్య నిలబెడతామని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment