ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy) తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా ‘శుభలగ్నం’(Shubhalagnam) గుర్తుంది కదా? అందులో డబ్బు పిచ్చితో భార్య తన భర్తను మరో మహిళకు(Women) కోటి రూపాయలకు అమ్మేస్తుంది. సరిగ్గా 32 ఏళ్ల క్రితం వచ్చిన ఆ సినిమా కథను తలపిస్తూ.. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) భోపాల్ (Bhopal) ఫ్యామిలీ కోర్టు (Family Court) సాక్షిగా ఒక అసాధారణ ఒప్పందం కుదిరింది. 23 ఏళ్ల వైవాహిక బంధాన్ని ముగించి, తన భర్తను రూ.1.5 కోట్ల విలువైన సెటిల్‌మెంట్‌తో ఆయన ప్రియురాలికి అప్పగించింది ఓ భార్య.
వివరాల్లోకి వెళితే.. ఈ దంపతులకు 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం భర్త వయసు 42 ఏళ్లు, వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. భర్త ఒక కేంద్ర ప్రభుత్వ శాఖలో అధికారిక హోదాలో ఉన్నాడు. అయితే, కొంతకాలంగా తనతో పాటు పనిచేస్తున్న, తనకంటే దాదాపు 10 ఏళ్లు పెద్దదైన (54 ఏళ్లు) ఒక మహిళతో సదరు భర్త సన్నిహితంగా ఉంటున్నాడని భార్య ఆరోపించింది. ఈ వివాహేతర సంబంధం వల్ల ఇంట్లో నిత్యం గొడవలు జరగడం, తన తండ్రి కుటుంబాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండటంతో పెద్ద కుమార్తె తట్టుకోలేకపోయింది. తల్లిదండ్రుల గొడవల వల్ల తాము చదువుకోలేకపోతున్నామంటూ ఆ బాలికే స్వయంగా భోపాల్ ఫ్యామిలీ కోర్టును (Bhopal Family Court) ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాలిక ఫిర్యాదుతో స్పందించిన ఫ్యామిలీ కోర్టు కౌన్సిలర్లు.. భార్యాభర్తలతో పాటు ఆ ప్రియురాలిని కూడా పిలిపించి పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. అయితే, భర్త మాత్రం తన భార్యతో కలిసి ఉండటానికి ససేమిరా అన్నాడు. “నేను నా ప్రియురాలితోనే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాను” అని కోర్టు ముందే స్పష్టం చేశాడు. ఒకవైపు 23 ఏళ్ల బంధం ముక్కలవడం, మరోవైపు భర్త వేరే మహిళతోనే ఉంటానని పట్టుబట్టడంతో భార్య ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. రోజూ గొడవలు పడుతూ నరకం అనుభవించడం కంటే, పిల్లల భవిష్యత్తును సురక్షితం చేసుకోవడమే ఉత్తమమని భావించింది.
భర్తను వదిలేయడానికి సదరు భార్య కొన్ని కఠినమైన షరతులు పెట్టింది. తనకు, తన ఇద్దరు కూతుళ్ల ఆర్థిక భద్రత కోసం భారీ సెటిల్‌మెంట్ కావాలని డిమాండ్ చేసింది. దీనికి భర్తతో పాటు ఆయన ప్రియురాలు కూడా అంగీకరించారు. భార్య, పిల్లలు నివసించడానికి ఒక ఖరీదైన డూప్లెక్స్ ఇల్లు, తక్షణ అవసరాలు, పిల్లల చదువుల కోసం రూ. 27 లక్షల నగదు ఇవ్వాలని కండీషన్ పెట్టింది. ఇల్లు, నగదు కలిపి దాదాపు రూ. 1.5 కోట్లుగా లెక్కగట్టారు. ఈ మొత్తాన్ని భర్త తరఫున ఆయన ప్రియురాలే భరించడానికి సిద్ధపడటం ఇక్కడ విశేషం.
ఈ సెటిల్‌మెంట్ అనంతరం భార్య మాట్లాడుతూ.. తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. “ఇన్నేళ్ల కాపురం తర్వాత నా భర్త ఇలా మారడం నన్ను తీవ్రంగా బాధించింది. మారలేని మనసుతో రోజూ గొడవలు పడటం కంటే, నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం ముఖ్యం అనిపించింది. నేను ఈ డబ్బు నా స్వార్థం కోసం అడగలేదు, నా ఇద్దరు కూతుళ్ల చదువు, పెళ్లిళ్ల కోసమే తీసుకున్నాను” అని ఆమె భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ విడాకుల ఒప్పందాన్ని భోపాల్ ఫ్యామిలీ కోర్టు కూడా అధికారికంగా ఆమోదించింది.








