కొడాలితో చనువు.. గుడివాడ ఎస్ఐపై బదిలీ వేటు!

కొడాలితో చనువు.. గుడివాడ ఎస్ఐపై బదిలీ వేటు!

Summarize with AI

సొంత పార్టీ నేత‌లైనా, త‌న కింద ప‌నిచేసే అధికారులైనా వైసీపీ నేత‌ల‌ను ఎప్పుడూ శ‌త్రువులుగా చూడాల‌నే తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన భావ‌న‌గా క‌నిపిస్తోంది. మొన్న వైసీపీ నేత‌ల‌తో వేదిక పంచుకున్న టీడీపీ నేత‌ల‌పై సీరియ‌స్ అయిన చంద్ర‌బాబు.. తాజాగా పోలీస్ ఆఫీస‌ర్‌పై బ‌దిలీ వేటు వేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అధికార టీడీపీ అనుసరిస్తున్న ఈ రాజకీయ వైఖ‌రిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసే పోలీస్ ఆఫీస‌ర్లు కూడా వైసీపీ నేతలతో శత్రుభావంతోనే మెలగాలని టీడీపీ భావిస్తోంది. మాజీ మంత్రి కొడాలి నానితో చనువుగా మెలిగాడనే ఏకైక కారణంతో గుడివాడ ఎస్ఐ వైవీవీ సత్యనారాయణను ఎస్పీ వీఆర్‌కు బదిలీ చేయడం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

ఈనెల 10న డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ప్రతి నియోజకవర్గంలోనూ భారీ ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ క్రమంలో గుడివాడలో ర్యాలీకి అనుమతి లేదంటూ మాజీ మంత్రి కొడాలి నానికి ఎస్ఐ నోటీసు అందజేశారు. అయితే ఆ నోటీసును లెక్కచేయకుండా కొడాలి నాని ర్యాలీలో పాల్గొన్నారు. ఈ పరిణామం కంటే.. కొడాలి నానితో ఎస్ఐ నవ్వుతూ మాట్లాడటం స్థానిక టీడీపీ పెద్దలకు నచ్చలేదు. అందుకే ఆయనను గుడివాడ నుంచి తప్పించారనే విమర్శలు వస్తున్నాయి.

కేవలం 11 సీట్లకే వైసీపీ పరిమితమైందని టీడీపీ తరచూ విమర్శిస్తుంటే, క్షేత్రస్థాయిలో మాత్రం పూర్తిగా భిన్నమైన రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో వైసీపీకి ఇప్పటికీ సానుకూలత ఉందనే మాట బలంగా వినిపిస్తోంది. అందుకే కొడాలి నానితో ఎస్ఐ చనువుగా వ్యవహరించారనే చేదు వాస్తవాన్ని టీడీపీ గ్రహించలేకపోయిందని, కేవలం చర్యల పేరుతో అత్యుత్సాహం ప్రదర్శించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

క్షేత్రస్థాయిలో ప్ర‌జ‌ల నాడిని, రాజ‌కీయ గాలిని గుర్తించేది ప్రభుత్వ ఉద్యోగులే. అందుకే అధికార పార్టీ మాట‌లు వింటూనే, మరోవైపు ప్రతిపక్షంతో దురుసుగా ప్రవర్తించి భవిష్యత్తులో ఇబ్బందులు పడటం ఎందుకనే ధోరణితో ఉద్యోగులు మెలుగుతుంటారు. ఇదే వైఖరి టీడీపీకి నచ్చలేదు. కానీ, ఉద్యోగుల మనోభావాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని గ్రహించకుండా, గుడివాడ ఎస్ఐపై ఏకంగా చర్యలు తీసుకోవడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగేలా కూటమి ప్రభుత్వం స్వయంగా తావిచ్చిందనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment