10 ఏళ్లు పూర్తి చేసుకున్న బాహుబలి సినిమా

10 ఏళ్లు పూర్తి చేసుకున్న బాహుబలి సినిమా

దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి’ (‘Baahubali’). ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా పదేళ్లు పూర్తయింది. 2015 జులై 10న విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’ తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి, పాన్ ఇండియా సినిమా ట్రెండ్‌కు మార్గదర్శకమైంది.

ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్‌గా నిలబెట్టిన ఈ చిత్రం, తెలుగు సినిమా సత్తాను దేశవ్యాప్తంగా చాటింది. ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్ వంటి తారలు నటించిన ఈ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించి, రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయంగా పలు అవార్డులు కూడా గెలుచుకుంది.

మొదట రూ. 150 కోట్లతో ఒకే భాగంగా ప్లాన్ చేసిన ఈ చిత్రం, కథ విస్తృతి కారణంగా రూ. 250 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కింది. బాహుబలి పాత్ర కోసం ప్రభాస్ 105 కిలోల బరువు పెరిగి, ఆ తర్వాత శివుడి పాత్ర కోసం 85 కిలోలకు తగ్గారు. రానా కూడా 33 కిలోలు పెరిగారు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ‘కిలికిలి’ అనే కొత్త భాషను సృష్టించారు.

హైదరాబాద్‌ (Hyderabad)లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రధానంగా చిత్రీకరించిన ఈ సినిమాలోని మంచు కొండల సన్నివేశాలను బల్గేరియాలో తెరకెక్కించారు. బాహుబలి తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా తన విజువల్ వండర్‌కు ప్రసిద్ధి చెందింది. బాహుబలి 10 ఏళ్లు(10 Years) పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment