‘విష’ వలయంలో ఏపీ సంక్షేమ హాస్టళ్లు.. ఇవిగో ఆధారాలు!!

‘విష’ వలయంలో సంక్షేమ హాస్టళ్లు.. ఇవిగో ఆధారాలు!!

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో విద్యార్థుల భవితవ్యం (Students Future) ప్రశ్నార్థకంగా మారుతోంది. పేద, గిరిజన విద్యార్థులకు (Tribal Students) అండగా ఉండాల్సిన సంక్షేమ వసతి గృహాలు (Welfare Hostels) నేడు మృత్యుకూపాలుగా మారుతున్నాయి. కుళ్లిపోయిన కూర‌గాయ‌లతో కూర‌లు, పురుగుల అన్నం, క‌లుషిత‌మైన మంచినీరు.. నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఆస్పత్రుల పాలు కావడం, మరికొందరు ప్రాణాలు కోల్పోవడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. ఓటు హక్కు లేని చిన్నారుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా? అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

కూటమి ప్రభుత్వంలో వరుస ప్రమాదాలు
గత కొన్ని నెలలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నమోదైన సంఘటనలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి (Government Negligence) అద్దం పడుతున్నాయి. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన కొత్త‌లో నూజివీడు ట్రిపుల్ ఐటీలో (Nuzvid Triple IT) ఏకంగా 800 మంది అస్వస్థతకు గురైన సంఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా సృష్టించింది. అదే విధంగా అల్లూరి జిల్లాలో కటారి కరుణ (Katari Karuna), గౌతమ్ (Gautham), కవిత (Kavitha) వంటి గిరిజన విద్యార్థులు వైద్యం అందక మృత్యువాత పడ్డారు. నాయుడుపేటలో 139 మంది, నంద్యాలలో 100 మంది, చిత్తూరులో 300 మందికి పైగా విద్యార్థులు ఫుడ్ పాయిజన్ (Food Poisoning) బారిన పడ్డారు. అనకాపల్లి జిల్లా పాసా ట్రస్ట్‌లో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో ద‌య‌నీయ ప‌రిస్థితుల‌కు అద్దం ప‌డుతున్నాయి.

మౌలిక సదుపాయాల లేమి.. పాలకుల చిన్నచూపు
గ్రామాలకు దూరంగా ఉండి చదువుకోవాలనే తపనతో ఆశ్రమ పాఠశాలలను ఆశ్రయించే గిరిజన విద్యార్థులపై అధికారులు, పాలకులు చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల అభ్యున్నతికి రూ. కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నాం.. పాఠశాలలు, వసతి గృహాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.. అని మాటలు పలికే ప్రజా ప్రతినిధులు.. కనీసం వసతి గృహంలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని వ‌రుస సంఘ‌ట‌న‌లే నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి.

రాజకీయ ఆరోపణలు.. కార్పొరేట్ ప్రయోజనాలు?
సాక్షాత్తూ హోంమంత్రి అనిత(Anitha) హాస్ట‌ల్‌ను తనిఖీ చేసిన సమయంలో భోజనంలో బొద్దింక రావడం ఈ వ్యవస్థ ఎంతలా దిగజారిందో నిరూపిస్తోందంటున్నారు. గత ప్ర‌భుత్వంలో అమలైన ‘గోరుముద్ద’ వంటి పథకాల పేర్లు మార్చడంలో చూపిన శ్రద్ధ, నాణ్యమైన భోజనం అందించడంలో చంద్ర‌బాబు ప్రభుత్వం చూపడం లేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను, హాస్టళ్లను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసి, కార్పొరేట్ విద్యా సంస్థలకు లాభం చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందా? అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.

హైకోర్టు తీవ్ర ఆగ్రహం
రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో వరుస మరణాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. “45 మంది విద్యార్థులు చనిపోవడం చిన్న విషయం కాదు. జ్వరం, ఇన్‌ఫెక్షన్లతో మరణించారంటే వారికి కనీస వైద్య సాయం అందనట్లే” అని ప్రభుత్వంపై కోర్టు నిప్పులు చెరిగింది. 108 వాహనాలు సకాలంలో రాకపోవడం, వైద్యుల పర్యవేక్షణ లేకపోవడంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హాస్టళ్లలో మెస్ నిర్వహణను పర్యవేక్షించాల్సి ఉంది. నిర్ల‌క్ష్యంతో విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడం ఆపాలి. లేనిపక్షంలో భవిష్యత్ తరాలు ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయం అని విద్యార్థుల త‌ల్లిదండ్రులు, విద్యావేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు.

2024 జూలై నుండి 2026 జనవరి వరకు జరిగిన వరుస ఘటనలు (మ‌చ్చుకు కొన్ని)


15.07.2024న
తిరుపతి జిల్లా నాయుడుపేటలో కలుషిత ఆహారంతో 139 మంది గురుకుల విద్యార్థులకు అస్వస్థత.. ఏడుగురి పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

04.08.2024న నంద్యాల జిల్లా కేంద్రం శివారులోని వెంకటేశ్వరపురం ఎస్డీఆర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 100 మందికిపైగా విద్యార్థులకు అస్వస్థత.

21.08.2024న చిత్తూరు అపోలో కాలేజీలో కలుషిత ఆహారంతో 300 మందికిపైగా విద్యార్థులకు వాంతులు, విరేచనాలు. ఇద్దరి పరిస్థితి విషమంగా మారిన విష‌యం తెలిసిందే.

27.08.2024న శ్రీకాకుళం జిల్లా తామరాపల్లి మహిళా రెసిడెన్షియల్ కాలేజీలో ఎలుకలు కరిచి ఐదుగురు విద్యార్థినులకు గాయాలు. నరసన్నపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స.

27.08.2024న కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని బీఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాల/కాలేజీలో ఫుడ్ పాయిజన్. 62 మంది గురుకుల విద్యార్థినులకు అస్వస్థత.

28.08.2024న ఏలూరు జిల్లాలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో అనారోగ్యానికి గురైన 342 మంది విద్యార్థులు. 3 రోజుల్లో 800 మందికి అస్వస్థత. 29వ తేదీన మరో 123 మందికి అస్వస్థత.

30.08.2024న అల్లూరి సీతారామరాజు జిల్లా, డుంబ్రిగూడ మండలం, జామిగుడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారంతో 79 మంది విద్యార్థినులకు అస్వస్థత.

15.11.2024న తిరుపతి జిల్లా సత్యవేడులోని గురుకుల పాఠశాలకు చెందిన 56 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. జ్యోతిరావుపూలే బాలుర గురుకుల పాఠశాలలో భోజనానికి వెళ్లినప్పుడు అపరిశుభ్రత, వర్షాల వల్ల విష జ్వరాలు.

31.07.2025న గుంటూరు జిల్లా తెనాలిలో శిక్ష‌ణ నిమిత్తం వ‌చ్చిన క‌స్తూర్బా గాంధీ బాలిక‌ల విద్యాల‌యం ఉపాధ్యాయినుల‌కు 50 మందికిపైగా అస్వ‌స్థ‌త‌.

03.08.2025న పురుగులు ప‌డిన భోజ‌నం మాకొద్దంటూ వైయ‌స్సార్ క‌డ‌ప జిల్లా ఇడుపుల‌పాయ ట్రిపుల్ ఐటీ మెస్ లో విద్యార్థుల ఆందోళ‌న‌.

17.08.2025న తీవ్ర జ్వ‌రంతో గురుకుల విద్యార్థిని మృతి. రాచ‌ర్ల బాలిక‌ల గురుకుల పాఠ‌శాల‌లో ప‌దో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ప్ర‌కాశం జిల్లా అర్థ‌వీడు మండ‌లం వెల‌గ‌ల‌పాయ‌కు చెందిన క‌టారి క‌రుణ (15). తీవ్ర జ్వ‌రం రావ‌డంతో మృత్యువాత‌.

26.10.2025న ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరో గిరిజన విద్యార్థిని బలి. జ్వరం, ఊపిరితిత్తుల వ్యాధితో కవిత మృతి. పార్వతీపురం మన్యం జిల్లా హడ్డుబంగి పాఠశాల వద్ద బాలిక మృతదేహంతో ఆందోళన.

01.01.2026న కలుషిత ఆహారంతో 34 మంది విద్యార్థులకు అస్వస్థత. పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న వెంటనే కడుపునొప్పి, వాంతులు. అన్నమయ్య జిల్లా రాయవరం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఘటన.

17.01.2026న సర్కారు నిర్లక్ష్యానికి మరో ఆశ్రమ విద్యార్థిని బలి. సకాలంలో అందని వైద్యం. 108 వాహనానికి ఫోన్ చేస్తే రెండు గంటల తర్వాత వస్తామని సమాధానం. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు పీహెచ్ సీకి తరలింపు. పాడేరు ఆస్పత్రికి వెళ్లేందుకూ అందుబాటులో లేని 108. సంక్రాంతి పండగ వేళ కైరుపల్లి గ్రామంలో పెను విషాదం.

24.01.2026న 30 మంది విద్యార్థినులకు అస్వస్థత. అనంతపురం జిల్లా 43 ఉడేగోళం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత ఘటన.

Join WhatsApp

Join Now

Leave a Comment