ఏపీలో ఆందోళనకరంగా టీనేజీ ప్రెగ్నెన్సీలు.. కుప్పంలోనే అత్య‌ధికం

ఏపీలో ఆందోళనకరంగా టీనేజీ ప్రెగ్నెన్సీలు.. కుప్పంలోనే అత్య‌ధికం

ఆంధ్రప్రదేశ్‌లో టీనేజీ ప్రెగ్నెన్సీలు ప్రమాదకర స్థాయికి చేరుతున్నాయి. 13-19 ఏళ్ల మ‌ధ్య బాలిక‌ల గ‌ర్భ‌ధార‌ణ‌ గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సగటున 8.8 శాతం టీనేజీ బాలికలు గర్భం దాలుస్తుండటం సామాజిక, ఆరోగ్య రంగాల్లో పెద్ద సవాలుగా మారింది.

అందులోనూ చిత్తూరు జిల్లాలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిథ్యం వ‌హిస్తున్న‌ కుప్పం నియోజకవర్గంలో 14.9 శాతం టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవడం రాష్ట్రంలోనే అత్యధికంగా ఉండటం గమనార్హం. ఈ స్థాయి గణాంకాలు బాల్య వివాహాలు, అవగాహన లోపం, ఆరోగ్య సేవల లోటు వంటి సమస్యలను మరోసారి వెలుగులోకి తీసుకొచ్చాయి.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, బాపట్ల, కర్నూలు జిల్లాల్లో 12 శాతం కంటే ఎక్కువగా టీనేజీ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇది జాతీయ సగటుతో పోలిస్తే ఎక్కువగా ఉండటం ప్రభుత్వానికి హెచ్చరికగా మారింది.

వైద్య నిపుణుల ప్రకారం, టీనేజీ వయసులో గర్భం దాల్చడం వల్ల మాతృ మరణాల ప్రమాదం, శిశువుల ఆరోగ్య సమస్యలు, రక్తహీనత, పోషకాహార లోపం, విద్య మధ్యలో ఆగిపోవడం వంటి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు, నిపుణులు బాల్య వివాహాలు, లైంగిక ఆరోగ్యంపై సరైన అవగాహన లేకపోవడం, పేదరికం, పాఠశాలల నుంచి బాలికలు డ్రాప్ అవడం వంటి అంశాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.

టీనేజీ ప్రెగ్నెన్సీలను తగ్గించాలంటే బాల్య వివాహాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది. స్కూల్ స్థాయిలో, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఏపీలో టీనేజీ ప్రెగ్నెన్సీల పెరుగుదల కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు.. భవిష్యత్ తరాలపై ప్రభావం చూపే సామాజిక సమస్యగా మారుతోందన్న హెచ్చరికలు బలంగా వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment