20 నెలల్లోనే రికార్డ్.. అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్

20 నెలల్లోనే రికార్డ్.. అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని, సంపద సృష్టిస్తారని ప్రజలకు వాగ్దానాలు చేసిన చంద్ర‌బాబు నాయుడు అధికార పీఠం ఎక్కిన 20 నెల‌ల్లోనే త‌న రికార్డ్‌ను తానే బ‌ద్ద‌లు కొట్టార‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. సంప‌ద సృష్టి మాట అటుంచి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మాత్రం అప్పులు (Loans) చేయడంలో తన పాత రికార్డులను తానే తిరగరాస్తున్నారని బ‌డ్జెట్ స‌మావేశాల (Budget Sessions) సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది. 20 నెలల కాలంలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం అయ్యింద‌ని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అప్పుల్లో తనకు తానే పోటీ!
గతంలో 2014-19 మధ్య ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) చేసిన మొత్తం అప్పు రూ. 2,49,530 కోట్లు. ఈసారి అధికారంలోకి వచ్చిన కేవలం 20 నెలల్లోనే ఆ రికార్డును అధిగమించి ఏకంగా రూ. 3,28,321 కోట్ల అప్పులు చేయడం గమనార్హం. అంటే గతంలో ఐదేళ్లలో చేసిన అప్పును, ఇప్పుడు రెండేళ్లు కూడా నిండకుండానే దాటేశారని ఆర్థిక నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో రాష్ట్రం శ్రీ‌లంక అయిపోతుంద‌ని ఆరోప‌ణ‌లు చేసిన చంద్ర‌బాబు.. తన హ‌యాంలో బ‌హిరంగంగా చేస్తున్న అప్పుల‌పై ఏం స‌మాధాన‌మిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

వారానికో అప్పు.. మంగళవారం కోసం ఎదురుచూపు
ప్రతి మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వేలం ద్వారా అప్పులు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా మారింద‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం. తాజాగా ఈ మంగళవారం నాడు 7.70 శాతం భారీ వడ్డీతో మరో రూ. 3,100 కోట్లు అప్పు తెచ్చారు. బడ్జెట్ పరిధిలోని అప్పులు రూ. 1,79,264 కోట్లు కాగా, బడ్జెట్ వెలుపల (Off-budget) చేసిన అప్పులు రూ. 1,49,057 కోట్లకు చేరాయి.

బాబు మార్క్ అప్పులు
మొత్తం అప్పు (20 నెలల్లో): రూ. 3,28,321 కోట్లు
నెలవారీ సగటు: రూ. 16,416 కోట్లు
రోజువారీ సగటు: రూ. 547 కోట్లు
రాజధాని పేరుతో తెచ్చినవి: రూ. 47,387 కోట్లు
కార్పొరేషన్ల గ్యారెంటీ అప్పులు: రూ. 1,01,670 కోట్లు

ప్రశ్నార్థకమైన ‘సూపర్ సిక్స్’.. ఎక్కడ ఆ అభివృద్ధి?
ఎన్నికల సమయంలో ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలు కానీ, ఇతర సంక్షేమ పథకాలు కానీ క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. పోనీ, అప్పు తెచ్చిన వేల కోట్లు రాజధాని నిర్మాణం కోసమో లేదా కొత్త పరిశ్రమల కోసమో ఖర్చు చేస్తున్నారా అంటే అదీ లేదంటూ ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. రాజధాని అమరావతిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు, కొత్త ఆస్తుల సృష్టి జరగలేదు.. ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల రూపంలో ఇచ్చిందీ లేదు అని బ‌డ్జెట్ స‌మావేశాల సంద‌ర్భంగా చ‌ర్చ రాష్ట్ర వ్యాప్తంగా జ‌రుగుతోంది.

జ‌గ‌న్ హ‌యాంలో ప‌రిస్థితి ఇలా..
వైఎస్ జ‌గ‌న్ హ‌యాంలో డీబీటీ ప‌ద్ధ‌తిలో ఐదేళ్ల‌లో ఏకంగా రూ.2,73,756 కోట్లు రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అందాయ‌ని వైసీపీ శ్రేణులు గుర్తుచేస్తున్నారు. నాన్ డీబీటీ ద్వారా రూ.1,84,604 కోట్లు అందించారు. మొత్తంగా త‌న ఐదేళ్ల పాల‌న‌లో జ‌గ‌న్ డీబీటీ+నాన్ డీబీటీ ద్వారా ఏకంగా రూ.4,58,360 కోట్లు ప్ర‌జ‌ల‌కు అందించార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. జ‌గ‌న్ హ‌యాంలో చేసిన అప్పు కూడా 3,32,671 కోట్లు మాత్రమేనని అసెంబ్లీలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ఇచ్చారు. దీంతో ఎన్నిక‌ల స‌మ‌యంలో రూ.12 ల‌క్ష‌ల కోట్ల అప్పు చేశార‌న్న కూట‌మి నేత‌ల‌ దుష్ప్ర‌చారం బ‌ట్ట‌బ‌య‌లైంది. జ‌గ‌న్ త‌న ఐదేళ్ల ప‌రిపాల‌న కాలంలో చేసిన అప్పును చంద్ర‌బాబు నాయుడు కేవ‌లం 20 నెల‌ల్లోనే దాటేసి రికార్డ్ నెల‌కొల్పాడని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు.

నెల‌కు రూ.16 వేల కోట్ల అప్పు తెస్తున్న చంద్ర‌బాబు
చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అభివృద్ధి ముసుగులో అప్పులు చేస్తూ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నారని విపక్షాలు, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నెలకు రూ. 16 వేల కోట్లు అప్పు చేస్తూ, ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతున్నారని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల‌తో రాష్ట్రాన్ని న‌డిపించ‌డం మానేసి.. ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన‌ట్టుగా సంప‌ద సృష్టించ‌డంపై, ప్ర‌జ‌ల‌కు మంచి చేయ‌డంపై ధ్యాస పెట్టాల‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment