ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాజా బడ్జెట్‌పై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా పెన్షన్ లబ్ధిదారులు, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, సొంత నివాసం లేని నిరుపేదల సమస్యలపై స్పష్టత లేకపోవడాన్ని ప్రతిపక్షాలు ఎత్తిచూపుతున్నాయి.
కూటమి మేనిఫెస్టోలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఆ పథకానికి సంబంధించి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు లేకపోవడం చర్చనీయాంశమైంది. కొత్తగా పెన్షన్ల మంజూరుపై కూడా ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై స్పష్టత ఇవ్వకపోవడంపై విద్యార్థి వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. విద్యాదీవెన, వసతిదీవెన పథకాల కింద రూ.8 వేల కోట్లకుపైగా బకాయిలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బడ్జెట్లో ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌లకు కూడా అరకొర కేటాయింపులు మాత్రమే ఉన్నాయని విమర్శిస్తున్నారు.
సున్నావడ్డీ రుణాలు లేవు..
మహిళా సంక్షేమం విషయంలోనూ ప్రభుత్వం మొండిచెయ్యి చూపిందని విమర్శలు వస్తున్నాయి. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని హామీ ఇచ్చినా, ఆ అంశానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మేనిఫెస్టోలో చెప్పిన కీలక హామీలు అమలుకాకపోవడంపై మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు
ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో కూడా నిరాశ వ్యక్తమవుతోంది. పీఆర్సీ, ఐఆర్ అంశాలపై బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం, సీపీఎస్ రద్దుపైనా స్పష్టత ఇవ్వకపోవడం ఉద్యోగ సంఘాల ఆగ్రహానికి దారితీసింది. అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని చెప్పినప్పటికీ, మూడు బడ్జెట్లు వచ్చినా అమలు చేయలేదని ఉద్యోగ వర్గాలు విమర్శిస్తున్నాయి.
పేదల నివాసాలకు సున్నా కేటాయింపు
పేదల గృహనిర్మాణం విషయంలోనూ బడ్జెట్లో స్పష్టత లేకపోవడం చర్చనీయాంశమైంది. ప్రతీ పేదవాడికి 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చినా, ఇప్పటివరకు ఒక్క పేద కుటుంబానికి కూడా ఇంటి పట్టా ఇవ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన గృహ నిర్మాణ పనులను కూడా పూర్తిచేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. బడ్జెట్లో ఇంటి స్థలాల మంజూరుపై ప్రస్తావన లేకపోవడం, ఇప్పటికే పూర్తయిన ఇళ్లను తమ ఖాతాలో వేసుకోవడంపై రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మొత్తంగా చూస్తే, తాజా బడ్జెట్లో సంక్షేమ హామీల అమలుపై స్పష్టత లేకపోవడం, కీలక వర్గాల ఆశలను నెరవేర్చలేకపోవడం ప్రభుత్వంపై విమర్శలకు దారితీస్తోంది. రాబోయే రోజుల్లో ఈ అంశాలు రాజకీయంగా మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.








