ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, ఇందులో భారీ ద్రవ్యలోటు, అప్పుల పెరుగుదల ప్రధాన అంశాలుగా నిలిచాయి.
ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో రూ.75,868 కోట్ల ద్రవ్యలోటు (Fiscal Deficit), సుమారు రూ.22 వేల కోట్ల రెవెన్యూ లోటును చూపించింది. ఆర్థిక పరిస్థితులు సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ ఏడాది కూడా భారీగా అప్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఓపెన్ మార్కెట్ ద్వారా రూ.76,182 కోట్లు, కేంద్రం నుంచి రూ.19,033 కోట్లు అప్పుగా తీసుకోవాలని ప్రతిపాదించింది. మొత్తంగా దాదాపు రూ.97 వేల కోట్ల అప్పులను సమీకరించాలనే ప్రణాళిక బడ్జెట్‌లో పొందుపరిచింది.
ఇప్పటికే రాష్ట్ర అప్పుల విషయంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన చంద్రబాబు ప్రభుత్వం మరోసారి అప్పులపైనే ఆధారపడటం గమనార్హం. ఈ నేపథ్యంలో బడ్జెట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిరుద్యోగుల విషయంలో ఈ బడ్జెట్ నిరాశ కలిగించింది. నిరుద్యోగ భృతికి ఒక్క పైసా కేటాయింపులు లేకపోవడం ప్రశ్నార్థకంగా మారింది. అలాగే మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ఇచ్చిన హామీకి కూడా నిధులు కేటాయించలేదు. ‘ఆడబిడ్డ నిధి’ పథకానికి ఈసారి సున్నా కేటాయింపులు ఉండటం మహిళా వర్గాల్లో అసంతృప్తికి దారితీసింది. అధికారంలోకి రాగానే ఆడబిడ్డ నిధి ద్వారా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలకు రూ.1500 చొప్పున ఇస్తామని ఇప్పటికీ మూడో బడ్జెట్ ప్రవేశపెట్టినా, ఆడబిడ్డ నిధి లేకపోవడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల కోసం ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి రూ.6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. అయితే 54 లక్షల రైతు కుటుంబాలకు ప్రతి ఏడాది రూ.20 వేల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఈ కేటాయింపులు సరిపోవని విమర్శలు వినిపిస్తున్నాయి. ధరల స్థిరీకరణ నిధికి కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించడం కూడా చర్చనీయాంశమైంది.
కొత్త పథకాలకు గణనీయమైన కేటాయింపులు లేకపోవడం, సంక్షేమ హామీల అమలుపై స్పష్టత లేకపోవడం బడ్జెట్‌పై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. భారీ అప్పులు, లోటు ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది.








