ఆంధ్రప్రదేశ్ బీజేపీలో మరోసారి వివాదం తలెత్తింది. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మరియు మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య మాటల తూటాలు పేలాయి. తమ నిర్ణయమే గెలవాలని ఎవరి వారు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. చివరకు సోము వీర్రాజు పైచేయి సాధించారు.
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒత్తిడితో పిక్కి నాగేంద్ర జిల్లా అధ్యక్షుడిగా నియమితులవ్వగా, పురందేశ్వరి నిర్ణయించిన అభ్యర్థి ఎన్. హారికకు ఈ పదవి దక్కకపోవడం చర్చనీయాంశమైంది. తాజా పరిణామాలు బీజేపీ శ్రేణుల్లో ఆసక్తి రేకెత్తించాయి. ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగినట్లు సమాచారం.
టీడీపీతో అనుబంధం?
దగ్గుబాటి పురందేశ్వరిపై టీడీపీకి వెన్నుదన్నుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు మరోసారి ముందుకు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో అనపర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా శివరామకృష్ణంరాజును ప్రకటించగా, టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అండగా నిలబడ్డారన్న విమర్శలు ఆమెపై ఉన్నాయి.
ఈ వ్యవహారంతో పాటు తన మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయోజనాల కోసం బీజేపీ ప్రయోజనాలను పక్కనపెట్టారన్న అభియోగాలు ఆమె ప్రతిష్ఠను దెబ్బతీశాయి. ఈ కారణంగా బీజేపీ అధిష్ఠానం పురందేశ్వరి సూచనలను పట్టించుకోవడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి.
పార్టీ భవిష్యత్తుపై ప్రశ్నలు
పురందేశ్వరి మరియు సోము వీర్రాజుల మధ్య సంబంధాలు మొదటినుంచే హోరాహోరీగా ఉన్నాయి. వీరిద్దరి విభేదాలు పార్టీ క్షేత్రస్థాయిలో బలహీనతకు దారితీస్తాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కొత్త అధ్యక్షుడి నియామకంపై కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది.