మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మార్చి 7 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఇవాళ గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతో మొద‌ల‌య్యాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 17 పనిదినాల పాటు అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 వరకు జరగనున్నాయి. ఈ నెల 14వ తేదీన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై విస్తృత చర్చ జరగనుండగా, 18వ తేదీన ఆర్థిక మంత్రి బడ్జెట్‌పై సమాధానం ఇవ్వనున్నారు. మహాశివరాత్రి పండుగ నేపథ్యంలో 16వ తేదీన సెలవు ప్రకటించారు.

ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు సమావేశాలు
అసెంబ్లీ సమావేశాలు ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ జీరో అవర్ నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 10 గంటలకే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ముగించనున్నారు. అలాగే డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై 8 రోజుల పాటు చర్చ జరగనుంది. మార్చి 1, 2, 3 తేదీల్లో సభకు సెలవులు ప్రకటించారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో అసెంబ్లీ సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. మార్చి 6న అమరావతిలో సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మొత్తం 6 ఆర్డినెన్స్‌లకు ఆమోదం తెలపనున్నారు.

అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు విధానం : స్పీక‌ర్‌
బీఏసీ సమావేశాల అనంతరం మీడియాతో చిట్‌చాట్ నిర్వ‌హించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక విషయాలను వెల్లడించారు. రేపటి నుంచే అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు విధానాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. సభ్యులు తమ సీట్లలో కూర్చున్నప్పుడే హాజరు నమోదయ్యే విధంగా ఈ సిస్టమ్ పనిచేస్తుందని చెప్పారు. భవిష్యత్తులో ఇదే విధానాన్ని పార్లమెంట్‌లోనూ ప్రవేశపెట్టే ఆలోచన ఉందన్నారు.

అమరావతిలో అభివృద్ధి పనులు వేగం
ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలను అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు స్పీకర్ వెల్లడించారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస సముదాయాలకు ఏప్రిల్ చివర్లో గృహప్రవేశం చేయనున్నట్లు తెలిపారు. దేశంలోనే అత్యుత్తమంగా ఏపీ అసెంబ్లీ భవనాన్ని నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో ఉంచుకొని కొత్త అసెంబ్లీలో 300కు పైగా సభ్యులు కూర్చునే సామర్థ్యం ఉండేలా డిజైన్ చేస్తున్నామని చెప్పారు. 2028 డిసెంబర్ నాటికి కొత్త అసెంబ్లీ భవనం అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment