అప్పులకు సంబంధించి ప్రతిపక్ష వైసీపీపై అధికార టీడీపీ, జనసేన, బీజేపీ చేసిన, చేస్తున్న ప్రచారం తప్పు అని ఏపీ అసెంబ్లీ సాక్షిగా తేలిపోయింది. ఎన్నికల సమయంలో రూ.10 లక్షల కోట్లు, రూ.12 లక్షల కోట్లు.. అని ప్రచారం జరగ్గా, ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఇంకాస్త ముందుకెళ్లి రూ.14 లక్షల కోట్లు అని చేసిన ప్రచారం అంతా అవాస్తవం అని శాసనసభ సాక్షిగా తేలిపోయింది. అప్పులపై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మత్స్యరాస విశ్వేశ్వర రాజు, తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. 2014 నుంచి 2019 వరకు, 2024 నుంచి 2025 వరకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో నెలల వారీగా వివరాలు కోరారు.
మెలిక పెట్టినా తెలిసిపోయింది..
నెలవారీగా ప్రతిపక్ష వైసీపీ సభ్యులు అప్పు వివరాలు కోరగా, కూటమి ప్రభుత్వం మాత్రం శ్వేతపత్రం ప్రకారం సమాధానం విడుదల చేయడం గమనార్హం. 2024 జూన్ 12వ తేదీ వరకు ఏపీ అప్పులు రూ.9,74,556 కోట్లు అంటూ మెలికపెట్టేలా లిఖితపూర్వక సమాధానంలో పేర్కొంటూనే.. దానికి అనుగుణంగా ఇచ్చిన టేబుల్‌లో మాత్రం.. 2014-15 ఆర్థిక సంవత్సరానికి చంద్రబాబు చేసిన అప్పు రూ.1,48,743.46 అని తెలిపింది. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి అప్పు రూ.2,57,509.90గా పేర్కొంది. గత ఐదేళ్లు వైఎస్ జగన్ ప్రభుత్వంలో అప్పును మాత్రం (ఆర్థిక సంవత్సరంతో సంబంధం లేకుండా) జూన్ 12వ తేదీ వరకు పరిగణిస్తూ లెక్కలు చూపించింది. ఐదేళ్లలో అప్పు రూ.5,19,192 కోట్లు అని లేఖలో పేర్కొంది.
కరోనా ఉన్నప్పటికీ రూ.4 వేల కోట్లే అధికం..
ప్రభుత్వం తెలిపిన లెక్కల ప్రకారం ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రూ. 2,61,683 కోట్లు మాత్రమే అని ఏపీ శాసనసభ బహిర్గతం చేసింది. వైసీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు ఆర్థికమంత్రి లిఖితపూర్వక సమాధానంతో స్పష్టీకరించారు. జూన్ 12, 2024 నాటికి ఏపీ అప్పులు రూ. 5,19,192 కోట్లున్నాయని, 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.2,57,509 కోట్లు అప్పు కాగా, వైఎస్ జగన్ హయాంలో చేసిన అప్పు రూ. 2,61,683 కోట్లుగా ప్రకటించారు. అదే విధంగా కార్పొరేషన్ ల ద్వారా గత ఐదేళ్లలో రూ. 1,09,217 కోట్లు అప్పు మాత్రమే చేశారని, మొత్తం కలుపుకొని వైసీపీ ప్రభుత్వంలో రూ. 3,70,900 కోట్లు గత ఐదేళ్లలో తెచ్చినట్టు ఏపీ శాసనసభలో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఆర్థిక శాఖ ప్రకటించింది. తన ఐదేళ్ల పదవీ కాలంలో కరోనాతో రెండు సంవత్సరాలు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులతో తల్లడిల్లినా, చంద్రబాబు కంటే వైఎస్ జగన్ కేవలం రూ.4 వేల కోట్ల అప్పు మాత్రమే అధికంగా చేశారు.
ఆ ప్రచారమంతా తప్పేనన్న అసెంబ్లీ రిపోర్ట్
2024 ఎన్నికల సమయంలో తెచ్చిన అప్పు సైతం కలిపి లెక్కించారు. వైసీపీ హయాంలో రూ.10 లక్షల కోట్ల అప్పు అని చంద్రబాబు, రూ.12 లక్షల కోట్లు అని పవన్ కళ్యాణ్, రూ.14 లక్షల కోట్ల అప్పు అని ఏపీ బీజేపీ గత అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన ప్రకారం తప్పు అని తేలిపోయింది. జగన్ ప్రభుత్వం అప్పులపై టీడీపీ, జనసేనది తప్పుడు ప్రచారమే అని నిర్ధారణ అయ్యింది. అసెంబ్లీ సాక్షిగా బట్టబయలైన టీడీపీ అప్పుల అబద్దాలు అని వైసీపీ మండిపడుతోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో రికార్డ్ స్థాయిలో రూ.2 లక్షల కోట్ల అప్పు చేసిందనీ వైసీపీ మండిపడుతోంది.
అప్పులపై టీడీపీ ప్రచారం బట్టబయలు
— Telugu Feed (@Telugufeedsite) September 22, 2025
గత @ysjagan హయాంలో చేసిన అప్పు రూ. 2,61,683 కోట్లు మాత్రమేనని స్పష్టీకరణ
వైసీపీ ఎమ్మెల్యేల ప్రశ్నకు ఆర్థికమంత్రి @PayyavulaOffl లిఖితపూర్వక సమాధానం
జూన్ 12, 2024 నాటికి రూ.5,19,192 కోట్లు అప్పున్నట్టు ప్రకటన
2014-19 చంద్రబాబు దిగిపోయే… pic.twitter.com/bla6Qb1sdJ








