‘శ్రీరాముడి మీద ఒట్టు’.. ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆవేద‌న

'శ్రీరాముడి మీద ఒట్టు'.. ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఆవేద‌న

ఆంధ్రప్రదేశ్ శాసనసభ వేదికగా బీజేపీ ఎమ్మెల్యే తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను కూట‌మి భాగ‌స్వామి పార్టీల్లో ఒక‌టైన‌ బీజేపీ ఎమ్మెల్యే అయినప్పటికీ, పక్క నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యేనే తనపై పగబట్టి తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు శాస‌న‌స‌భ వేదిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు మాట్లాడుతూ.. “నాకు ఎటువంటి అండదండలు లేవు. బీజేపీ ఎమ్మెల్యే అనే కారణంతోనే నన్ను లక్ష్యంగా చేసుకుని పేపర్లు, టీవీల్లో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. నా పరిస్థితి శాసనసభలో విన్నవించుకోవాల్సి వస్తోంది. కూట‌మి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వైసీపీ నేతలకు క్వారీలు శాంక్షన్ అవుతున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే డీడీ మహేష్‌కు క్వారీ కేటాయించారు. దీనిపై స్థానిక కూటమి కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తడంతో కలెక్టర్ అనుమతితో తవ్వకాలు ఆపేశారు. కానీ విచారకరం ఏమిటంటే, మన కూటమి ఎమ్మెల్యే కూడా వారి తరఫున నిలుస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎవరికి చెప్పుకోవాలి?” అని ప్రశ్నించారు.

డ‌బ్బులు డిమాండ్ చేశాన‌ని ప్ర‌చారం..
“నాపై బ్లాక్‌మెయిల్ ఆరోపణలు చేస్తున్నారు. డబ్బులు అడిగానని, ఇవ్వకపోతే క్వారీ ఆపించానని అంటున్నారు. కానీ ఈరోజు వరకు ఆ క్వారీ నుంచి ఒక్క ట్రాక్టర్ గ్రావెల్ కూడా నేను అమ్మలేదు. రాముడి మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను.. నాకు ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవు. శ్రీకాకుళం, విజయనగరంలో ఉన్న ఏకైక బీజేపీ ఎమ్మెల్యేను. అయినా కూడా నాకు ఎటువంటి సపోర్ట్ లేదు, అండదండ లేదు. ఇది ఎంత అమానుషమో సభ గమనించాలి” అని ఆవేదన వ్యక్తం చేశారు. “కొంతమంది వారి వ్యాపార ప్రయోజనాల కోసం నన్ను బలిచేయాలని చూస్తున్నారు. ఇది సరైంది కాదు. ఈ గ్రావెల్ వ్యవహారంపై ప్రభుత్వం ఎంక్వయిరీ చేయించి, కఠిన చర్యలు తీసుకోవాలి” అని ఈశ్వరరావు డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment