అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత వైసీపీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, కీలక నేతలు పార్టీని వీడిపోగా.. తాజాగా మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన అవంతి శ్రీనివాస్ తన రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి పంపించారు. తన కుటుంబానికి ఐదేళ్లుగా దూరమయ్యానని, వ్యక్తిగత జీవితం పట్ల బాధ్యత వహించాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. వైసీపీని వీడి వెళ్తూ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు అవంతి శ్రీనివాస్.
గౌరవం తగ్గిపోయింది..
వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని చెబుతూనే తనకు ఎక్కడ గౌరవం లభిస్తుందో, అటువైపు వెళ్తానని వ్యాఖ్యనించారు. వైసీపీలో కార్యకర్తలకు, నాయకులకు గౌరవం తగ్గిపోయిందని, పార్టీలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని, గ్రామ, వార్డు వాలంటీర్లే పాలనంతా నడిపారని ఆరోపించారు.
సమయం ఇవ్వకుండా ధర్నాలేంటి..?
ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలే అయ్యిందని, ప్రభుత్వానికి సమయం ఇవ్వాలంటూ అవంతి శ్రీనివాస్ అన్నారు. సమయం ఇవ్వకుండా అప్పుడే ధర్నాలకు పిలుపునిచ్చారని, ఇప్పటికే వైసీపీలో ఐదేళ్లుగా నలిగిపోయి ఉన్నామన్నారు. ఆదేశాలు ఇవ్వడం చాలా ఈజీ.. అన్ని విషయాలు అర్థం చేసుకోవాలన్నారు. సమయం ఇవ్వకుండా జమిలి ఎన్నికలు ముంచుకొస్తున్నాయని ధర్నాలు చేయమంటున్నారని, ఇది మంచి పద్దతి కాదని అవంతి శ్రీనివాస్ అన్నారు.
రాజీనామా లేఖ..
తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు. తన రాజీనామాను ఆమోదించవలసినగా కోరుతున్నానట్లు లేఖలో పేర్కొన్నారు.








