పోలవరం-బనకచర్ల (Polavaram-Banakacharla)పై కేంద్ర జలశక్తి శాఖ (Central Jal Shakti Ministry) మంత్రి సి.ఆర్. పాటిల్ (C.R. Patil) నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రుల (Chief Ministers) సమావేశం ముగిసింది. ఈ సమావేశం గంటన్నర పాటు జరిగింది. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఏకైక ఎజెండాగా ప్రతిపాదించగా, తెలంగాణ ప్రభుత్వం 13 కీలక అంశాలను ఎజెండాగా పెట్టింది. ఈ సమావేశం గోదావరి (Godavari), కృష్ణా (Krishna) నదుల జల విభజన (Rivers Water Division) , సంబంధిత ప్రాజెక్టుల అనుమతులపై తీవ్ర చర్చలకు వేదికగా నిలిచింది.
ఏపీ ఎజెండా ఇదీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీటిని కృష్ణా నది ద్వారా రాయలసీమకు తరలించాలని ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టు రూ.81,900 కోట్లతో రాయలసీమలోని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేయడంతో పాటు 8 మిలియన్ల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
తెలంగాణ వాదనలు..
అయితే, తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఈ ప్రాజెక్టుకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ అవార్డు 1980ని ఉల్లంఘిస్తుందని ఆరోపించింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఈ ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) లేదా ఎక్స్‌పర్ట్ అప్రైసల్ కమిటీ (ఈఏసీ) నుంచి అనుమతులు లేవని, భద్రాచలం వంటి ప్రాంతాలపై ప్రభావం ఉంటుందని వాదించారు.
తెలంగాణ ఎజెండా..
తెలంగాణ ప్రభుత్వం తమ ఎజెండాలో పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు, సమ్మక్క సాగర్, ప్రాణహిత-చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరింది. అలాగే, శ్రీశైలం నుంచి ఇతర బేసిన్‌లకు నీటి తరలింపును నిలిపివేయాలని, కృష్ణా నది జలాల అక్రమ తరలింపును అడ్డుకోవడానికి టెలిమెట్రీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, శ్రీశైలం డ్యాం సేఫ్టీ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు పోలవరం తరహాలో నిధులు కేటాయించాలని, 200 టీఎంసీ గోదావరి నీటిని వినియోగించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడంతో పాటు, నీటి వివాదాలను చట్టబద్ధంగా, సాంకేతికంగా పరిష్కరించాలని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ కోరింది. ఈ సమావేశం ఫలితాలు ఇరు రాష్ట్రాల నీటి హక్కులు, ప్రాజెక్టుల అమలుపై కీలక ప్రభావం చూపనుంది.