ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం (Coalition Government) కొలువుదీరి 13 నెలలు పూర్తయింది. ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం తాను చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలిఅడుగు(Toli Adugu) పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ తరుణంలో ఓ ఆసక్తికర సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రతి మంగళవారం అప్పు సేకరణలో భాగంగా కూటమి ప్రభుత్వం 13 నెలల కాలంలో రూ.1,75, 412 కోట్ల అప్పు చేసిందనేది బహిరంగ రహస్యమే.
చంద్రబాబు ప్రభుత్వం 13 నెలల్లో చేసిన అప్పును (Loan) నెలలు, రోజులు, గంటలు, నిమిషాల ప్రకారం భాగహారం చేస్తే షాకింగ్ నంబర్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం చేసిన 1,75,412 కోట్ల అప్పులో బడ్జెట్ పరిధిలో 1,20,000 కోట్లు, బడ్జెటేతర అప్పు 75,412 కోట్లుగా ఉందని లెక్కలు, ఇటీవల ప్రచురితమైన వార్తా కథనాలు చెబుతున్నాయి.
కూటమి ప్రభుత్వం 13 మాసాల్లో నెలకు సగటున రూ 13,493 కోట్ల అప్పు చేసింది. దీన్ని నెలలోని 30 రోజులతో భాగిస్తే.. రోజుకు రూ.450 కోట్లు, అదే గంటకు రూ.18.7 కోట్లు, నిమిషానికి రూ.31.2 లక్షలుగా షాకింగ్ నంబర్లు కనిపిస్తున్నాయి. అంటే 13 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం నిమిషానికి రూ.31.2 లక్షల అప్పు చేసిందని స్పష్టం అవుతోంది.
మధ్యతరగతి కుటుంబ పెద్ద నెలవారి జీతం సగటున రూ.40 వేలు అనుకున్నా.. గంటకు రూ.55 మాత్రమే. అలాంటిద్ర్ ప్రభుత్వం ఏకంగా నిమిషానికి (Per Minute) రూ.31.2 లక్షల చొప్పున అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిన భారాన్ని మోపుతోందా అని ప్రజలు సైతం ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి.
ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఏడాది పాలనలోనే 1,75,412 కోట్ల రికార్డ్ స్థాయిలో అప్పు తెచ్చారని, ఇక ఐదేళ్లలో ఇంకెంత అప్పు చేస్తారో.. ప్రజల నెత్తిన ఎంత భారం మోపుతారోనని ఆర్థిక నిపుణులు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో డీబీటీ ద్వారా ఇచ్చిన పథకం ఇటీవల అమలు చేసిన తల్లికి వందనం పథకం. ఈ పథకానికి రూ.10 వేల కోట్లు మేర ఖర్చు చేశామని ప్రభుత్వం చెప్పింది. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ప్రజా సంక్షేమార్థం రూ.2.75 లక్షల కోట్ల నగదు డీబీటీ ద్వారా చెల్లిస్తే.. కూటమి ప్రభుత్వం ఏడాదిలో రికార్డ్ స్థాయిలో చేసిన రూ.1,75,412 అప్పు ఏమైందని వైరివర్గం నుంచి ప్రశ్నల దాడి కొనసాగుతోంది.