దేశంలోనే అతిపెద్ద స్టేడియం విశాఖపట్టణానికి దూరం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థికంగా, అభివృద్ధిపరంగా కాస్త పేరున్న విశాఖ నగరంలో నిర్మించాల్సిన దేశంలోని సెకండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం గ్రేటర్ వైజాగ్‌ను విడిచి వెళ్లిపోతోంది. రాజకీయ జోక్యమే ఈ మార్పునకు కారణంగా తెలుస్తోంది. బెజవాడ గ్యాంగ్ ఎంట్రీతో క్రీడలు, వాటి నిర్వహణల్లోనూ పాలిటిక్స్ మొదలయ్యాయని, క్రీడాకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీ హయాంలో భూసేకరణ పూర్తి
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియం తరహాలో విశాఖపట్టణంలోనూ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే స్థాయి మైదానం నిర్మించాలన్న ఆలోచన వాస్తవానికి గత వైసీపీ హయాంలో బీజం పడింది. దానికి కావాల్సిన ప్రక్రియలను నాటి జగన్ సర్కార్ కంప్లీట్ చేసింది. వైజాగ్‌లో అతిపెద్ద ఇంటర్నేషనల్ స్టేడియంతో పాటు ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఫారెస్ట్ ల్యాండ్ కు బదులు కొంత ల్యాండ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఇందుకు సంబంధించి సుమారు 30 ఎకరాల భూమిని కూడా నాటి వైయస్ జగన్ ప్రభుత్వం సమీకరించింది. ప్రస్తుతం విశాఖలో ఉన్న వైయస్ఆర్ స్టేడియం దేశవాళీ మ్యాచ్‌లకు, కొత్తగా నిర్మించే స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడించాలని, సుమారు 50 వేల మందితో సీటింగ్ కెపాసిటీ లక్ష్యంగా ప్రణాళిక రూపొందించింది.
అమరావతికి తరలింపు..
ప్రభుత్వం మారిపోయిన తరువాత ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం స్థితిగతులు ప్రశ్నార్థకంలో పడ్డాయని క్రీడాకారులు విమర్శిస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లోకి బెజవాడ గ్యాంగ్ ఎంట్రీతో విశాఖలో అన్ని హంగులతో నిర్మించాల్సిన స్టేడియం అమరావతికి తరలిపోతోందన్నవిషయం క్రీడాకారులను ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ స్టేడియం విశాఖలో కాదు, అమరావతిలో నిర్మిస్తామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ కేశినేని చిన్ని ఇప్పటికే ప్రకటించారు.
ఐసీసీ మార్గదర్శకాలు బేఖాతరు
అమరావతి కూతవేటు దూరంలో ఉన్న మంగళగిరిలోనూ క్రికెట్ స్టేడియం నిర్మించినప్పటికీ.. పిచ్, గ్యాలరీ నిర్మాణంలో నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. మధ్యాహ్నం సమయంలో బ్యాట్స్‌మెన్ కళ్లలో సూర్యుడి కాంతి పడకుండా ఉండటానికి, క్రికెట్ పిచ్‌లు వీలైనంత వరకు ఉత్తరం-దక్షిణం దిశకు దగ్గరగా ఉండాలని ఐసీసీ మార్గదర్శకాలు సిఫార్సు చేస్తున్నాయి. అయితే మంగళగిరి స్టేడియంలో ఈస్ట్-వెస్ట్ (రివర్స్ డైరెక్షన్)లో పిచ్ నిర్మించడంతో ప్లేయర్లకు ఇబ్బంది తలెత్తుతోంది. దీంతో బ్యాట్స్‌మెన్స్ వ్యూ ప్రకారం పిచ్ మార్చడంతో.. గ్యాలరీలో కూర్చునే ప్రేక్షకులకు మ్యాచ్ సరిగ్గా కనిపించని పరిస్థితి తలెత్తినట్లుగా సమాచారం. దీంతో విశాఖపట్నంలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించాల్సిన క్రికెట్ స్టేడియం అమరావతికి తరలిస్తున్నారని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడల్లోనూ రాజకీయ జోక్యం తగదని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.







