లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సవరణ బిల్లు, జమ్మూ-కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులను సభలో ప్రతిపాదించారు. ముఖ్యంగా 130వ రాజ్యాంగ సవరణ బిల్లులో, తీవ్రమైన నిరారోపణలపై 30 రోజులకు పైగా అరెస్టులో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులు ఆటోమేటిక్‌గా పదవిని కోల్పోవాలని ప్రతిపాదించారు. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239 ఏఏలకు సవరణలు చేయాలని కేంద్రం భావిస్తోంది.
అయితే, ఈ బిల్లులపై ప్రతిపక్షం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. నేరం రుజువయ్యేంతవరకు వ్యక్తిని నిర్దోషిగా చూడాలని రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక నిబంధనలకు ఈ బిల్లులు విరుద్ధమని వారు వాదించారు. ఈ బిల్లుతో అధికారుల చేతికి అపరిమిత అధికారం లభించి దేశం పోలీస్ స్టేట్‌గా మారే ప్రమాదం ఉందని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా ఈ బిల్లులు రూపొందించబడ్డాయని పేర్కొన్నారు.
లోక్‌సభలో బిల్లులపై తీవ్ర వాగ్వాదం నెలకొనడంతో స్పీకర్ బిల్లులను జాయింట్ పార్లమెంటరీ కమిటీకి (జెపిసి) రిఫర్ చేశారు. ఈ సందర్భంగా కొందరు ప్రతిపక్ష ఎంపీలు బిల్లుల ప్రతులను చించివేసి నిరసన వ్యక్తం చేశారు. గందరగోళం మధ్య సభ వాయిదా పడగా, మళ్లీ సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది.








