లోక్‌సభలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాజ్యాంగ ఆమోదానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ ఉభయసభల్లోనూ రాజ్యాంగంపై సుదీర్ఘ చర్చ జరగింది. ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన చర్చలో హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
అమిత్‌షా ఏమన్నారంటే..
“అంబేద్కర్ పేరును రాజకీయ లబ్ధి కోసం వాడుతున్నారు. ప్రతీదానికి ‘అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్’ అని జపం చేయడం ఇప్పుడు ఫ్యాషన్ మారిపోయింది. ఇలా అంబేద్కర్ పేరుకు బదులు దేవుడి పేరును తలుచుకుంటే ఏడేడు జన్మలకు పుణ్యం లభిస్తోంది.. స్వర్గానికైనా వెళ్లొచ్చు” అంటూ వ్యాఖ్యానించారు.
తీవ్ర దుమారం..
అమిత్‌షా సభలో చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. అంబేద్కర్‌ను కించపరిచేలా కేంద్రమంత్రి మాట్లాడారంటూ ప్రతిపక్ష పార్టీలతో సహా అంబేద్కర్ ఆశయాలను అనుసరించేవారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అమిత్‌షా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అమిత్‌షా వ్యాఖ్యలపై కాంగ్రెస్‌తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.







