“గొంతులో ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే నడుస్తాను. కూటమి ప్రభుత్వాన్ని కూల్చే వరకు నా పోరాటం ఆగదు” అంటూ అంబటి రాంబాబు అన్నారు. అన్ని కేసుల్లో బెయిల్ పొందిన అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మాజీ మంత్రి, కాపు నేత అంబటి రాంబాబు విడుదలయ్యారు. జైలు బయట మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
“18 రోజులు సెంట్రల్ జైలులో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది పోలీసులు, కూటమి నేతలు కలిసి చేసిన ప్రయత్నం. 18 రోజులు జైల్లో పెడితే భయపడతాం అనుకున్నారేమో. కానీ అంబటి రాంబాబుకు భయం లేదు” అని వ్యాఖ్యానించారు. “చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డాను. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. పరిస్థితులు మారుతాయి… పాపానికి పరిహారం చేయక తప్పదు” అని అన్నారు.
దాడులపై ఆవేదన
తన నివాసంపై దాడి జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “ఏడు గంటల పాటు నా ఇంటి వద్ద దాడి జరిగింది. అక్కడే పోలీసులు ఉన్నారు. రక్షించాల్సిన పోలీసులు పారిపోవాలని చెప్పారు. ఇల్లు ధ్వంసం చేశారు, కార్లు తగలబెట్టారు. నా కుటుంబాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు. “దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ వచ్చింది. దాడులు చేయించుకున్న వారికి మాత్రం 18 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది” అంటూ విమర్శించారు.
వెనక్కి తగ్గేది లేదన్న అంబటి
“ఎన్ని కేసులు పెట్టినా ఒక్క అడుగు కూడా వెనక్కు వేయను. ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కి వెళ్లే ప్రశ్నే లేదు. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ పట్టుదల పెంచే శిక్షణ కేంద్రం లాంటిది. జైలు జీవితాన్ని కూడా ఆస్వాదిస్తాను” అని అన్నారు. “రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. జైల్లో పెడితే భయపడే వ్యక్తిని కాదు. ఎక్కడా ఎప్పుడూ తప్పు చేయలేదు. తప్పు జరిగితే వెంటనే పశ్చాత్తాప పడతాను” అని తెలిపారు.
జగన్ వెంటనే నడుస్తా
“ఆనాడు వైఎస్సార్ వెనక నడిచాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనక నడుస్తాను. గుండెలో ప్రాణం ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటా” అని మరోసారి స్పష్టం చేశారు.“రేపు గుంటూరులో నా ఆవేదన మొత్తం ప్రజల ముందుపెడతాను. పత్రికల్లో వచ్చిన ప్రతి అంశంపై ప్రజలకు చెప్పుకోవాలి” అని తెలిపారు. హోంమంత్రిపై కూడా వ్యాఖ్యానిస్తూ విమర్శలు గుప్పించారు. చివరగా “కాలమే నిర్ణయిస్తుంది” అని పేర్కొన్నారు.








