అంబటికి మరో కేసులో బెయిల్.. రేపు విడుదలకు ఛాన్స్

అంబటికి మరో కేసులో బెయిల్.. రేపు విడుదలకు ఛాన్స్

కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయస్థానం నుంచి కీలక ఊరట లభించింది. చంద్రబాబును దూషించార‌ని న‌మోదైన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబ‌టికి ఆ కేసులో ఇప్ప‌టికే న్యాయ‌స్థానం బెయిల్ మంజూరు చేయ‌గా, తాజాగా మ‌రో కేసులో ఊర‌ట ల‌భించింది. గ‌తేడాది నవంబర్ 12వ తేదీన నమోదైన కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో రేపు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా న‌వంబ‌ర్‌ 12న నిర్వ‌హించిన ర్యాలీలో సీఐ విధులను అడ్డుకున్నారన్న ఆరోపణలతో అంబటి రాంబాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో పట్టాభిపురం పోలీసులు మూడు రోజుల క్రితం పీటీ వారెంట్ ద్వారా ఆయనను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ కేసులోనూ బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా, గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేస్తూ, పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఆయనకు ఈ కేసులో న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఊరట లభించినట్లయింది.

ఇదిలా ఉండగా, ఇటీవలి కాలంలో అంబటి రాంబాబుపై నమోదైన మొత్తం 35 కేసుల్లోనూ అరెస్ట్ చేయవద్దంటూ ఇప్పటికే హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన్ను అరెస్ట్ చేయకుండా, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని 41ఏ సెక్షన్ ప్రకారం నోటీసులు జారీ చేసి విచారణ జరపాలని పోలీసులకు హైకోర్టు సూచించిన విషయం తెలిసిందే. వరుసగా న్యాయస్థానాల నుంచి అనుకూల ఆదేశాలు రావడంతో చేయ‌ని త‌ప్పున‌కు నింద‌లు వేసి అరెస్టులు చేస్తే ఇలాగే ఉంటుంద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment