అంబటికి బెయిల్.. ఆ ఒక్క కేసులో వ‌స్తే విడుద‌ల‌కు ఛాన్స్‌

అంబటికి బెయిల్ మంజూరు.. ఆ ఒక్క కేసులో వ‌స్తే విడుద‌ల‌కు ఛాన్స్‌

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు న్యాయ‌స్థానాల్లో భారీ ఊర‌ట ల‌భించింది. గుంటూరులోని స్పెషల్ మొబైల్ కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేసింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నమోదు చేసిన కేసులో అంబటిని జనవరి 31న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో బెయిల్ ఇవ్వడంతో పాటు, అంబటి కస్టడీ పిటిషన్‌ను కూడా మొబైల్ కోర్టు కొట్టివేసింది.

అయితే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీ కేసులో అంబటి రాంబాబు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులోనూ బెయిల్ లభిస్తే, అంబటి రాంబాబు విడుదలయ్యే అవకాశం ఉందని న్యాయ వర్గాలు చెబుతున్నాయి.

హైకోర్టులో ముందుగానే ఊరట
ఇదిలా ఉండగా, హైకోర్టులో అంబటి రాంబాబుకు కీలక ఊరట లభించిన విషయం తెలిసిందే. ఆయనపై నమోదైన 35 కేసుల్లో అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 41ఏ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని పోలీసులను ఆదేశించింది. 35 కేసులకు సంబంధించి దాఖలైన క్వాష్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మార్చి 2కి వాయిదా వేసింది. అప్పటి వరకు అరెస్ట్ చేయవద్దన్న ఆదేశాలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసు
ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సందర్భంగా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలతో అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. ఈ కేసులో పీటీ వారెంట్ ఆధారంగా రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు అంబటిని పట్టాభిపురం పోలీసులు తరలించారు. ఈ వ్యవహారంలో కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన న్యాయ కస్టడీలో ఉన్నారు.

మొత్తంగా, ఒక కేసులో బెయిల్ లభించినప్పటికీ మరో కేసులో రిమాండ్ కొనసాగుతుండటంతో అంబటి రాంబాబు విడుదలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కేసులో కోర్టు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment