హోలీ అంటే వెంటనే గుర్తొచ్చేది రంగుల వేడుక, కాముని దహనం. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా రంగుల తడిలో మునిగి తేలే ఈ పండుగ దేశవ్యాప్తంగా ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో హోలీ రోజున జరిగే వింత ఆచారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈ గ్రామ పురుషులు హోలీ సందర్భంగా చీరలు కట్టుకుని, ఆభరణాలు ధరించి, పూలతో అలంకరించుకుని స్త్రీల వేషధారణలో మారిపోతారు. ఈ వింత ఆచారం వెనుక ఉన్న విశ్వాసం ఏమిటంటే, మన్మథస్వామికి స్త్రీల రూపంలో పూజలు చేస్తే శుభం జరుగుతుందని, కోరికలు నెరవేరతాయని గ్రామస్థులు నమ్మకం. ఈ పూజా కార్యక్రమం రెండు రోజుల పాటు కొనసాగుతుంది. ఈ ప్రత్యేక హోలీ ఉత్సవాన్ని చూసేందుకు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు.








