నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ వార్‌

నేటి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ వార్‌

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 (ICC Champions Trophy) ఈరోజు (ఫిబ్రవరి 19) నుంచి ఘనంగా ప్రారంభం కానుంది. ఈసారి టోర్న‌మెంట్‌కు పాకిస్తాన్ (Pakistan) ఆతిథ్య‌మిస్తోంది. మొదటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్- న్యూజిలాండ్‌ల మ‌ధ్య పాక్‌లోని కరాచీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఇక, రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్‌తో తన తొలి పోరులో బరిలోకి దిగనుంది.

ఎనిమిదేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత మొద‌ల‌వుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అయితే, వెస్టిండీస్, శ్రీలంక జట్లు ఈ టోర్నమెంట్‌లో ఆడే అర్హత సాధించలేకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. మరోవైపు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ సహా ఎనిమిది దేశాలు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి.

పాక్‌కు భారీ అంచనాలు – కానీ కివీస్‌ సవాలు!
1996 వన్డే ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంకలతో కలిసి ఆతిథ్యం ఇచ్చిన పాకిస్తాన్‌.. ఇప్పుడు ఐసీసీ మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ టోర్నమెంట్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాక్, సొంతగడ్డపై బలమైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. అయితే, తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడటం ఆ జట్టుకు కఠిన పరీక్షగా మారనుంది. ఇప్పటికే ముక్కోణపు సిరీస్‌లో కివీస్‌ రెండు సార్లు పాకిస్తాన్‌ను ఓడించిన విషయం తెలిసిందే.

భారత్‌కు ప్రత్యేక షెడ్యూల్
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 12 లీగ్‌ మ్యాచ్‌లు, రెండు సెమీ ఫైనల్స్, ఒక ఫైనల్ జరగనున్నాయి. భారత జట్టు తమ లీగ్ దశలోని మూడు మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడనుంది. ఐసీసీ ప్రకారం, సెమీఫైనల్‌ మరియు ఫైనల్‌కు కూడా ప్రత్యేక షెడ్యూల్ రూపొందించారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ భారత అభిమానులకు మరింత ఆసక్తికరంగా మారనుంది. రోహిత్ శర్మ, కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లకు ఇది చివరి ఐసీసీ వన్డే టోర్నీ అయ్యే అవకాశం ఉండడంతో జట్టు ఈ టైటిల్‌ను ఖచ్చితంగా గెలుచుకోవాలని చూస్తోంది. క్రికెట్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ వైపే చూస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment