తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైసీపీ మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరుగురు భక్తుల మరణానికి దారితీసిన ఈ ఘటనపై ప్రభుత్వం, టీటీడీ, పోలీసులు తప్పుదారులు తొక్కుతున్నారని ఆమె ఆరోపించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌పై పెట్టిన సెక్షన్లు ఇక్కడ ఎందుకు అమలు చేయలేదు? అని ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటనలో బీఎన్‌ఎస్ 105 సెక్షన్ అల్లు అర్జున్‌పై అమలు చేస్తే, తిరుపతి తొక్కిసలాటపై మాత్రం 194 బీఎన్‌ఎస్ సెక్షన్ ఎందుకు పెట్టారని ఆమె నిలదీశారు. తిరుపతి వైకుంఠ ఏకాదశి సమయంలో లక్షలాది భక్తులు వచ్చే పరిస్థితిని ముందే అంచనా వేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, టీటీడీ, పోలీసులపై లేదా అని ఆమె ప్రశ్నించారు.
ప్రభుత్వంపై విమర్శలు..
ముఖ్యమంత్రి చంద్రబాబు, టీటీడీ అధికారులు, స్థానిక పోలీసులపై మాజీ మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. ఈ ప్రమాదానికి పూర్తి బాధ్యత ఎవరు తీసుకుంటారు? అని ఆమె ప్రశ్నించారు. సంధ్య థియేటర్ ఘటనలో నేరుగా ప్రమేయం లేని అల్లు అర్జున్‌పై సెక్షన్లు పెట్టారు. అదే తీరు తిరుపతి ఘటనలో ఎందుకు లేదు? అని ప్రశ్నించారు. ఈ ఘటనను రాజకీయ లబ్ధి కోసమే కప్పిపుచ్చుతున్నారని రోజా ఆరోపించారు.
సినిమాపై పెట్టిన చిత్తశుద్ధి భక్తుల భద్రతపై పెట్టరా..?
గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ నిర్వహణపై పెట్టిన చిత్తశుద్ది కూడా భక్తుల భద్రతపై అధికారులు పెట్టలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. సనాతనవాదిగా చెప్పుకునే పవన్‌కళ్యాణ్ దీనికి ఏం ప్రాయశ్చిత్తం చేస్తారో చెప్పాలి. దీనికి సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి ఎవరు రాజీనామా చేస్తారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పడానికి సెక్షన్–194 బీఎఎన్‌ఎస్ కేసులు పెట్టి చేతులు దులిపేసుకుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. తప్పు చేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టేదాకా బాధితుల పక్షాన వైసీపీ పోరాడుతోందన్నారు. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దేవుని మీద భక్తి లేని వ్యక్తి చైర్మన్..
తొక్కిసలాట ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. తిరుమల పవిత్రతను కాపాడుకునేలా, నిందితులకు శిక్ష పడేలా హైందవ శంఖారావం నిర్వాహకులు గట్టి ప్రయత్నం చేయాలన్నారు. ఈ ఘటనకు ప్రధాన కారకుడు తిరుమల జేఈవో వెంకన్న చౌదరి. ఆయన టీటీడీని టీడీపీ కార్యాలయంగా మార్చేశారన్నారు. దేవుని మీద భక్తి లేని వ్యక్తి బీఆర్ నాయుడుని తెచ్చి చైర్మన్ చేసి భక్తుల భద్రతను గాలికొదిలేశారని ప్రభుత్వంపై ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు.