తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల కారణంగా జరిగిన తొక్కిసలాట ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పరామర్శించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతికి చేరుకోనున్న జగన్, రుయా ఆసుపత్రికి వెళ్లి గాయపడిన బాధితులను కలవనున్నారు. అదే విధంగా మృతుల కుటుంబాలను కలిసి పరామర్శించనున్నారు. ఘటనకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకుంటారు. ప్రభుత్వం తరఫున బాధితులకు మెరుగైన పరిహారం అందేలా, క్షతగాత్రులకు వైద్యసేవలు అందేలా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నట్లు సమాచారం.
బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం సహాయం
ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం స్పందిస్తూ ఎక్స్గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు సైతం బాధితులను పరామర్శించేందుకు తిరుపతి బయల్దేరారు. వైఎస్ జగన్ కాసేపట్లో తాడేపల్లి నుంచి తిరుపతికి వెళ్లనున్నారు. అధికార, ప్రతిపక్ష నేతల పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.