ఏపీకి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈనెల 19వ తేదీన మత్స్యకారులు గల్లంతు కాగా, నేటికీ వారి ఆచూకీ తెలియకపోవడంతో బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
కాకినాడ జిల్లా ఉప్పాడ మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్, నేవీ అధికారులు సంయుక్తంగా విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నారని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు.
మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన విషయం ఈ నెల 19వ తేదీ సాయంత్రం జిల్లా యంత్రాంగం దృష్టికి వచ్చిందని, వెంటనే కోస్ట్‌గార్డ్ అధికారులను అప్రమత్తం చేశామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గల్లంతైన మత్స్యకారులు ఈ నెల 18వ తేదీన ఒడిశాలోని పారాదీప్ పోర్టు సమీపంలో కనిపించినట్లు ప్రాథమికంగా గుర్తించామని కలెక్టర్ తెలిపారు. ఆ తర్వాత వారి నుంచి ఫోన్, ట్రాన్స్‌పాండర్ ద్వారా ఎలాంటి సమాచారం అందలేదన్నారు.
కాకినాడ కోస్ట్‌గార్డ్ అధికారులు తక్షణమే స్పందించి ఒడిశా, చెన్నై కోస్ట్‌గార్డ్ కేంద్రాలకు సమాచారం అందించడంతో పాటు ఆయా విభాగాల మధ్య సమన్వయం ఏర్పాటు చేశారని వివరించారు.
గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం యుద్ధనౌకలు, హెలికాప్టర్లను వినియోగిస్తూ సముద్రంలో నిరంతరాయంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. బంగ్లాదేశ్, మయన్మార్ నేవీ అధికారులతోనూ ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకున్నామన్నారు.
వివిధ నిఘా, సమాచార వ్యవస్థల సహాయంతో మత్స్యకారుల చివరి కదలికలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. ఏడుగురు మత్స్యకారులు సురక్షితంగా తిరిగి వస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వారి ఆచూకీ లభించే వరకు సంబంధిత విభాగాల సమన్వయంతో గాలింపు చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. ఇంకా తెలియని ఆచూకీకాకినాడ జిల్లా ఉప్పాడ మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైనట్లు ఈ నెల 19వ తేదీ సాయంత్రం జిల్లా యంత్రాంగానికి సమాచారంగల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కోసం విస్తృత గాలింపు చేపట్టాంకోస్ట్గార్డ్, నేవీ సంయుక్తం యుద్ధనౌకలు, హెలికాప్టర్లతో గాలింపు చర్యలు చేపట్టిందిబంగ్లాదేశ్, మయన్మార్ నేవీ అధికారులకు సమాచారం ఇచ్చాం– జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్
— Telugu Feed (@Telugufeedsite) November 25, 2026








