తమిళనాడులో రాజకీయంగా కలకలం రేపిన మహిళా జిల్లా కలెక్టర్‌కు అసభ్యకర సందేశాలు పంపిన వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కల్లకురిచ్చి టీవీకే (TVK) ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమిళనాడు మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు మద్రాస్ హైకోర్టుకు తెలిపారు పోలీసులు.
జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలతో వెలుగులోకి వచ్చిన వివాదం
కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్‌కు టీవీకే ఎమ్మెల్యే అరుల్ విఘ్నేష్ అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. ఇదే అంశంపై ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ అన్నాడీఎంకేకు చెందిన న్యాయవాది ఆర్. తిరిసూలి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తొలుత ఫిర్యాదు అందలేదన్న పోలీసులు
ఈ పిటిషన్ నవంబర్ 23న జస్టిస్ లక్ష్మీ నారాయణన్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మహిళా జిల్లా కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి పోలీసుల తరఫున హాజరైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన క్రిమినల్ న్యాయవాది ఆర్. జాన్ సత్యన్ స్పందిస్తూ.. సంబంధిత జిల్లా కలెక్టర్ ఇప్పటివరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు అందలేదని కోర్టుకు వివరించారు.
కలెక్టర్, సీఎస్‌ను మరోసారి విచారించాలన్న హైకోర్టు
ఈ వ్యవహారంలో అసభ్యకర సందేశాలు పంపి ఉంటే అది దురదృష్టకరమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మరోసారి సంప్రదించి, ఈ అంశంపై వివరాలు సేకరించాలని పోలీసులను ఆదేశించారు. నవంబర్ 24న తదుపరి విచారణ సందర్భంగా పూర్తి వివరాలు తెలియజేయాలని సూచిస్తూ కేసు విచారణను వాయిదా వేశారు.
కలెక్టర్ ఫిర్యాదుతో ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్
నవంబర్ 23న కల్లకురిచ్చి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే సి. అరుల్ విఘ్నేష్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. తనతో అనుచితంగా ప్రవర్తించడంతో పాటు అసభ్యకర సందేశాలు పంపించారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా తమిళనాడు మహిళలపై వేధింపుల నిరోధక చట్టం కింద పోలీసులు ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఈ కేసు నవంబర్ 24న మద్రాస్ హైకోర్టులో విచారణకు రాగా, కలెక్టర్ ఫిర్యాదు ఆధారంగా టీవీకే ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు న్యాయస్థానానికి వెల్లడించారు. దీంతో ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.







