అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. పంజాబ్‌కు (Punjab) చెందిన ఓ సాధారణ ట్రక్ డ్రైవర్‌కు(Truck Driver) ఏకంగా రూ.12 కోట్ల బంపర్ లాటరీ తగిలింది. మొహాలీ జిల్లా డేరా బస్సీ ప్రాంతంలోని హమాయున్‌పూర్ గ్రామానికి చెందిన బల్జీందర్ సింగ్ (Baljinder Singh) గత 15 ఏళ్లుగా ప్రతి పండుగకు లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. 2010 నుంచి ఎన్నోసార్లు ప్రయత్నించినా అదృష్టం కలిసిరాలేదు. అయినప్పటికీ నమ్మకం కోల్పోకుండా టికెట్లు కొనుగోలు చేస్తూనే ఉన్నాడు. చివరకు 2026 పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్ లాటరీలో(Punjab State Dear Diwali Bumper Lottery 2026) మొదటి బహుమతిగా రూ.12 కోట్లు గెలుచుకున్నాడు.
ఈ విజయం బల్జీందర్ సింగ్ కుటుంబంలో ఆనందాన్ని నింపింది. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఆయన.. ఇన్నేళ్లుగా లాటరీ టికెట్లు (Lottery Tickets) కొంటున్న విషయాన్ని కుటుంబ సభ్యులకు కూడా పెద్దగా చెప్పలేదట. లాటరీ గెలిచిన అనంతరం తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. 2010 నుంచి ప్రతి పండుగకు టికెట్లు కొనుగోలు చేస్తున్నానని, ఎప్పటికైనా దేవుడు తన ప్రార్థనలు ఆలకిస్తాడని నమ్మేవాడినని తెలిపాడు. ఇప్పుడు తన కల నిజమైందని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలియడంతో గ్రామస్థులు ఆయన ఇంటికి చేరుకుని అభినందనలు తెలుపుతున్నారు.
మరోవైపు పంజాబ్‌లోని సంగ్రూర్‌కు చెందిన మరో వ్యక్తికి కూడా ఇదే లాటరీలో రూ.కోటి బహుమతి లభించింది. నవంబర్ 16న నిర్వహించిన పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్ 2026 డ్రాలో ఈ విజేత ఎంపికయ్యాడు. అయితే ఇప్పటివరకు ఆ వ్యక్తి ఎవరనేది గుర్తించలేదు. సంగ్రూర్ బస్టాండ్ సమీపంలోని లాటరీ దుకాణంలో టికెట్లు కొనుగోలు చేసినవారు మరోసారి తమ టికెట్లను పరిశీలించుకోవాలని దుకాణదారుడు సూచించాడు. మొత్తానికి 15 ఏళ్ల నిరీక్షణ తర్వాత ట్రక్ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్ తగలడం పంజాబ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.








