బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి ‘అక్వాన్’ తుఫాన్‌గా రూపాంతరం చెందింది. ప్రారంభంలో ఈ తుఫాన్ గమనం, తీరం దాటే ప్రాంత అంచనాలపై భిన్నమైన వాదనలు వినిపించినప్పటికీ, తాజాగా భారత వాతావరణ శాఖ (IMD) సమాచారం ప్రకారం.. ఈ తుఫాన్ తన దిశను కొద్దిగా మార్చుకుంది. తుఫాన్ ప్రభావ చూపే పరిధిని నెల్లూరు – తుని నుంచి ఏకంగా నెల్లూరు – విశాఖపట్నం మధ్యకు విస్తరించినట్లు స్పష్టం చేయడంతో ఉత్తర కోస్తా, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో టెన్షన్ తారాస్థాయికి చేరింది.
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం.. అక్వాన్ తుఫాన్ క్రమంగా బలపడి నవంబర్ 19 నాటికి ‘అతి తీవ్ర తుఫాన్’ రూపుదాల్చనుంది. నవంబర్ 20వ తేదీ (శుక్రవారం) మధ్యాహ్న సమయానికి ఇది ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కాకినాడకు దక్షిణంగా, మచిలీపట్నానికి ఉత్తరంగా ఈ తుఫాన్ కేంద్రీకృతమై తీరం దాటే ఛాన్స్ ఉండటంతో, గతంలో మునుపెన్నడూ లేని విధంగా డాక్టర్ కోనసీమ జిల్లాకు మరోసారి తీవ్ర పెను ముప్పు పొంచి ఉందంటున్నారు.
కోరంగి, ఉప్పాడ తీరాలకు ఉప్పెన ముప్పు
తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. దీనివల్ల సముద్రం అల్లకల్లోలంగా మారి, భారీ అలలు ఎగసిపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కోనసీమలోని ప్రసిద్ధ పర్యాటక, తీర ప్రాంతాలైన కోరంగి, ఉప్పాడ తీర ప్రాంతాలకు ఉప్పెన ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి.
భారీ వర్షాలు – రెడ్ అలర్ట్ జారీ
అక్వాన్ తుఫాన్ ప్రభావంతో నవంబర్ 19, 20 తేదీల్లో కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది. ఇప్పటికే వరుస తుఫాన్లతో (ఆర్నబ్, మురసు) అతలాకులమై కోలుకోలేకుండా ఉన్న రైతులు, తీర ప్రాంత ప్రజలు ఈ తాజా హెచ్చరికలతో హడలిపోతున్నారు.








