అనిరుధ్ – ధనుష్ మధ్య విభేదాలు.. కారణం ఇదేనా..?

అనిరుధ్ – ధనుష్ మధ్య విభేదాలు.. కారణం ఇదేనా..?

Summarize with AI

ఒకప్పుడు తమిళ సినీ పరిశ్రమలోనే(Tamil Film Industry) కాదు, యావత్ భారతీయ చిత్రసీమలో ‘DnA’ (ధనుష్ అండ్ అనిరుధ్) కాంబినేషన్ అంటే ఒక సంచలనం. వీరిద్దరూ కలిసి పనిచేస్తే ఆ ఆల్బమ్ చార్ట్‌బస్టర్ అవ్వాల్సిందే, సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టాల్సిందే. ‘3’ సినిమాలోని “వై దిస్ కొలవెరి డి” (Why This Kolaveri Di)పాటతో ఒక సాధారణ కుర్రాడిని రాత్రికి రాత్రే గ్లోబల్ రాక్‌స్టార్‌గా(Global Rockstar) మార్చిన ఘనత ముమ్మాటికీ హీరో ధనుష్‌దే(Dhanush).

కానీ, ఇప్పుడంతా తలకిందులైంది. తనకు సినీ జీవితాన్ని ప్రసాదించి, స్టార్‌డమ్‌కు పునాది వేసిన ధనుష్‌ను సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పూర్తిగా పక్కన పెట్టేశాడా? కనీసం ధనుష్ పేరును ఉచ్చరించడానికి కూడా అనిరుధ్ ఇష్టపడటం లేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

పెళ్లికి పిలుపు లేదు.. అసలు మాటలే లేవు
ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్‌ను (Kavya Maran) గ్రీస్ (Greece) దేశంలో అత్యంత సన్నిహితుల మధ్య అనిరుధ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సూపర్ స్టార్ రజనీకాంత్, ఐశ్వర్య రజనీకాంత్ (Aishwarya Rajinikanth) సహా పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు. అయితే, ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం ఏమిటంటే.. అనిరుధ్ కెరీర్‌కు ఆద్యుడైన ధనుష్‌కు కనీసం పెళ్లి ఆహ్వానం కూడా వెళ్లకపోవడం.

అంతేకాదు, నవంబర్ 21న చెన్నైలో(Chennai) జరగనున్న గ్రాండ్ రిసెప్షన్‌కు (Grand Reception) దక్షిణాది ముఖ్యమంత్రుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరికీ ఆహ్వానాలు అందాయి. కానీ ధనుష్ విషయంలో మాత్రం అనిరుధ్ మౌనం వహించడం వీరి మధ్య దూరం ఎంతగా పెరిగిందో స్పష్టం చేస్తోంది. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ కనీసం మాట్లాడుకోవడం కూడా మానేశారన్న వార్తలు నిజమని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి.

15 ఏళ్ల ప్రయాణంలో ధనుష్ పేరుకు స్థానమే లేదా?
తాజాగా అనిరుధ్ తన 15 ఏళ్ల సంగీత ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. అయితే అందులో తనకు తొలి అవకాశం ఇచ్చిన ‘3’ సినిమా హీరో ధనుష్ పేరును కనీసం ప్రస్తావించకపోవడం ధనుష్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

2012లో ఇదే అనిరుధ్.. “నా ఈ మ్యుజీషియన్ హోదాకు కారణం ఒకే ఒక్క వ్యక్తి. నన్ను సంగీత దర్శకుడిగా మార్చిన నా మెంటార్, బ్రో ధనుష్‌కు ధన్యవాదాలు” అని ట్వీట్ చేశాడు. నాడు ‘మెంటార్'(Mentor) అని ఆకాశానికెత్తిన అనిరుధ్, నేడు స్టార్ హోదా రాగానే, సన్ గ్రూప్ కుటుంబంతో బంధం ఏర్పరుచుకోగానే ఆ పేరునే మర్చిపోయాడా? అని నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

గతంలో ఐశ్వర్య రజనీకాంత్ సైతం.. “అనిరుధ్‌కు కీబోర్డ్ కొనివ్వడం నుంచి ‘3’ సినిమాలో అవకాశం ఇప్పించడం వరకు అంతా ధనుష్ ప్రోత్సాహమే” అని చెప్పిన పాత వీడియోలు ఇప్పుడు మళ్లీ వైరల్ అవుతున్నాయి.

ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడాకులు (Divorce) తీసుకుని విడిపోయిన తర్వాత, రజనీకాంత్ మేనల్లుడైన అనిరుధ్ తన కుటుంబం వైపే నిలబడాల్సి వచ్చింది. ఐశ్వర్య హాజరయ్యే వేడుకలకు ధనుష్‌ను పిలవడం ఇబ్బందికరమని భావించే పెళ్లికి దూరం పెట్టారని ఒక వాదన వినిపిస్తోంది.

గతంలో ధనుష్, శివకార్తికేయన్ సినిమాల విషయంలో అనిరుధ్ తీసుకున్న నిర్ణయాలు ధనుష్‌కు ఆగ్రహం తెప్పించాయని, ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటలు తగ్గిపోయాయని కోలీవుడ్ టాక్. 2017లో తమిళ నాట ప్రకంపనలు సృష్టించిన కొన్ని లీక్స్, వ్యక్తిగత విభేదాల నాటి నుంచే వీరి మధ్య గ్యాప్ మొదలై, ‘తిరుచిత్రంబలం’ తర్వాత పూర్తిగా ఆగిపోయింది.

లైఫ్ ఇచ్చినోడిని మరవకూడదు
సినీ పరిశ్రమలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్నది నిజమే కావచ్చు. కుటుంబ కారణాలు లేదా వ్యక్తిగత విభేదాలు ఎన్ని ఉన్నా.. ఒక కళాకారుడికి మొదటి మెట్టు వేసి, ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిని పూర్తిగా విస్మరించడం ఏమాత్రం సమంజసం కాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. కోట్లాది మంది సంగీత ప్రియులను అలరించిన ‘DnA’ కాంబినేషన్ ఇలా విడిపోవడం తమిళ సినిమాకు ఒక తీరని లోటే.

Join WhatsApp

Join Now

Leave a Comment