“చంద్రబాబు గెలిచి ఓడాడు.. మేము ఓడి గెలిచాం!”

"చంద్రబాబు గెలిచి ఓడాడు.. మేము ఓడి గెలిచాం!"

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తిగా అపహాస్యపాలైందని, ఇవి ప్రజల తీర్పును ప్రతిబింబించే ఎన్నికలు కాదని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మండిపడ్డారు. నామినేషన్ల ఘట్టం నుంచి కౌంటింగ్ వరకు ప్రతి దశను అధికార కూటమి ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల సంఘం కలిసి వ్యవస్థీకృతంగా హైజాక్ చేశాయని ధ్వజమెత్తారు.

తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ జగన్.. రాష్ట్రవ్యాప్తంగా సాగిన పోలింగ్ బూత్‌ల‌లో టీడీపీ రిగ్గింగ్, దౌర్జన్యాలు, అక్రమాలను నియోజకవర్గాలవారీగా వివ‌రించారు.

ప్రజాస్వామ్యానికి మూలస్తంభమైన స్వేచ్ఛాయుత ఎన్నికల సూత్రాన్ని చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా సమాధి చేసిందని జగన్ విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా 17 మున్సిపాలిటీల్లో వైసీపీ చైర్‌పర్సన్ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. మరో 22 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల దశలోనే పోటీ లేకుండా చేశారు.

పరిషత్ ఎన్నికల్లో ఏకంగా 84 జెడ్పీటీసీ, 2,109 ఎంపీటీసీ స్థానాల్లో బలవంతపు ఉపసంహరణలతో ఏకగ్రీవాలు చేసుకున్నారు. పులివెందులలో 80 బూత్‌లకు గాను 70 బూత్‌లలో వైసీపీ ఏజెంట్లను కూర్చోనివ్వకుండా తరిమేసి, దొంగ ఓట్లతో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు.

టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు పోలింగ్‌ బూత్‌ను ఆక్రమించి రిగ్గింగ్‌ చేసినా పోలీసులు పట్టించుకోలేదని, రీపోలింగ్‌లోనూ అదే వ్యక్తి వచ్చి ఓటు వేసి వెళ్లాడంటే ఇక్కడ వ్యవస్థలు ఎంత దిగజారాయో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.

బూత్‌ల ఆక్రమణలు, వేలిపై ఇంక్‌ గుర్తులు చెరిపేసేందుకు కెమికల్స్ వాడకం, సైక్లింగ్ పద్ధతిలో దొంగ ఓట్లు వేయించడం వంటి అరాచకాలు సాగాయని మండిపడ్డారు.

సోమవారం ఉదయానికి అదనంగా రాత్రికి రాత్రే విశాఖ‌లో లక్షకు పైగా ఓట్లు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర సీల్స్ వేయకుండా రాత్రిపూట అక్రమాలకు తెరలేపారని ఆరోపించారు.

ఎన్నికల అక్రమాలను ప్రశ్నించిన మరియు కవర్ చేసిన జర్నలిస్టులపై పచ్చ నేతలు దాడి చేసినా పోలీసులు స్పందించకపోవడం పత్రికా స్వేచ్ఛను ఖూనీ చేయడమేనని అన్నారు.

ఇచ్చిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ సహా 143 హామీలను అమలు చేయలేకపోయిన చంద్రబాబు, ప్రజలను ఎదుర్కొనే ధైర్యం లేకనే ఎన్నికల వ్యవస్థను కబ్జా చేశారని జగన్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయని, ప్రభుత్వ ఆస్తులు, మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టి రాష్ట్రాన్ని ‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’గా మార్చారని విమర్శించారు. వరుస తుఫాన్లతో రైతులు, ప్రజలు అల్లాడుతున్నా సహాయ చర్యలకంటే ఎన్నికల రిగ్గింగ్‌పైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని తప్పుబట్టారు.

“మేము ఓడి గెలిచాం”
అధికార బలంతో, పోలీసుల అండతో ఎన్నికల్లో గెలిచినా చంద్రబాబు ప్రజల మనసుల్లో మాత్రం పూర్తిగా ఓడిపోయారని జగన్ స్పష్టం చేశారు. అణచివేతలు, దాడులను ఎదుర్కొంటూ ప్రజాస్వామ్యం కోసం హీరోల్లా పోరాడిన ప్రతి వైయస్ఆర్‌సీపీ కార్యకర్తకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. నేడు ఓటు హక్కును హరించినవారే రేపు ప్రజల ఆస్తి హక్కులను కూడా లాక్కునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణల అత్యవసరతను తెలియజేసే కేస్ స్టడీగా నిలుస్తాయని పేర్కొంటూ.. “హే రామ్.. సేవ్‌ ఆంధ్ర.. హే రామ్.. సేవ్‌ డెమోక్రసీ” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment