ఆసియా పారా గేమ్స్ స్వర్ణ పతక విజేత మృతి..

ఆసియా పారా గేమ్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ యాదవ్ మృతి..

Summarize with AI

భారత పారా క్రీడా రంగంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆసియా పారా గేమ్స్‌లో స్వర్ణ పతకాలు సాధించిన ప్రముఖ పారా అథ్లెట్ నీరజ్ యాదవ్ (42) ఢిల్లీలోని తన నివాసంలో మృతి చెందినట్లు సమాచారం. ఆయన విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం గురు తేజ్ బహదూర్ (జీటీబీ) ఆసుపత్రికి తరలించారు. భారత పారా అథ్లెటిక్స్ ప్రధాన కోచ్ ఎస్. సత్యనారాయణ నీరజ్ మరణవార్తను ధ్రువీకరించినట్లు సమాచారం. అయితే, ఆయన మరణానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఏడేళ్ల వయసులో పోలియో కారణంగా శారీరక వైకల్యానికి గురైన నీరజ్ యాదవ్, పట్టుదలతో క్రీడల్లో రాణించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తొలుత వీల్‌చైర్ టెన్నిస్‌లో కొనసాగిన ఆయన, అనంతరం పారా అథ్లెటిక్స్‌లోకి ప్రవేశించి F55 విభాగంలో జావెలిన్ త్రో, డిస్కస్ త్రో వంటి ఈవెంట్లలో ప్రతిభ చాటారు. 2023లో చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియా పారా గేమ్స్‌లో జావెలిన్ త్రో, డిస్కస్ త్రో విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇటీవల డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఆయనపై నిషేధం విధించారని, దీంతో ఆసియా పారా గేమ్స్‌లో పాల్గొనే అవకాశం కోల్పోయారని వార్తలు వెలువడ్డాయి. ఈ పరిణామాలు ఆయనపై ఎలాంటి ప్రభావం చూపాయనే విషయం అధికారికంగా నిర్ధారణ కాలేదు. నీరజ్ మరణవార్తతో క్రీడా వర్గాల్లో విషాదం నెలకొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment