హైదరాబాద్‌లోని కవాడిగూడలో ఉన్న పవర్‌గ్రిడ్ కార్యాలయంలో మహిళల వాష్‌రూమ్‌లో రహస్యంగా మొబైల్ ఫోన్‌ను ఏర్పాటు చేసిన ఘటన కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఫ్లోర్ అటెండెంట్ భరత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 13న వాష్‌రూమ్‌లోని వాష్‌బేసిన్ కింద డబుల్ సైడెడ్ టేప్‌తో అతికించిన మొబైల్ ఫోన్‌ను ఓ మహిళా ఉద్యోగిని గుర్తించారు. ఫోన్ ఎవరిదని ప్రశ్నించగా, అటెండెంట్ భారత్ దాన్ని తీసుకుని అక్కడి నుంచి పరుగెత్తినట్లు సమాచారం. దీంతో అనుమానం వచ్చిన ఉద్యోగులు, భద్రతా సిబ్బంది సహకారంతో అతడిని పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఫోన్‌లోని వీడియోలను పరిశీలించేందుకు ప్రయత్నించగా, పిన్ లాక్ ఉన్న ఫోల్డర్ కనిపించింది. అనంతరం నిందితుడు ఫోన్‌ను నేలకేసి కొట్టినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదవగా, దర్యాప్తులో భాగంగా భారత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఫోన్‌లోని సమాచారాన్ని సాంకేతికంగా విశ్లేషించేందుకు కేసును సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు బదిలీ చేసినట్లు సమాచారం. ఫోన్‌లో ఎలాంటి వీడియోలు ఉన్నాయి? ఈ ఘటనలో మరెవరైనా ప్రమేయం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగాల్సి ఉంది. మహిళల వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన ఈ ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది.








