చంద్రబాబు సర్కార్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్

చంద్రబాబు సర్కార్‌కు సుప్రీంకోర్టులో భారీ షాక్

Summarize with AI

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల స‌మ‌యంలో సాగిస్తున్న ప్రజాస్వామ్య విధ్వంసం, అరాచ‌కంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలిచ్చింది. దీంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఎదురుదెబ్బ త‌గిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులపై జరుగుతున్న దాడులు, నామినేషన్లను అడ్డుకుంటున్న వైనంపై ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. చంద్రబాబు ప్రభుత్వ తీరును నిలదీస్తూ కీల‌క‌ ఆదేశాలు జారీ చేసింది.

వైసీపీ సమర్పించిన డిజిటల్, ఎలక్ట్రానిక్ ఆధారాలు, వీడియోలను పరిశీలించిన సుప్రీంకోర్టు.. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగడం లేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. “ఎన్నికల ప్రక్రియలో సాధారణంగా కోర్టులు జోక్యం చేసుకోవు.. కానీ చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలతో స్వేచ్ఛాయుత ఎన్నికలకు విఘాతం కలిగిస్తే న్యాయస్థానాలు చేతులు కట్టుకుని చూడవు” అని ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది.

సుప్రీంకోర్టు జారీ చేసిన నాలుగు కీలక ఆదేశాలు ఇవే
రాష్ట్ర ఎన్నికల సంఘం తుది అభ్యర్థుల జాబితాను తక్షణమే నిలిపివేయాలని, 2026 అక్టోబర్ 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను వాయిదా వేయాలని ఎస్ఈసీని సుప్రీం కోర్టు ఆదేశించింది.

నామినేషన్ల గడువు పొడిగింపుపై తక్షణ నిర్ణయం
వైసీపీతో పాటు బాధితులు సమర్పించిన వినతిపత్రాలు, వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలించి.. శాంతిభద్రతల సమస్యల వల్ల అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయిన పట్టణ స్థానిక సంస్థల్లో నామినేషన్ల దాఖలు గడువును పొడిగించే అంశంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది.

రేపటిలోగా నిర్ణయం..
నామినేషన్ల గడువు పొడిగింపుపై రాష్ట్ర ఎన్నికల సంఘం రేపటిలోగా (అక్టోబర్ 22) తప్పనిసరిగా తుది నిర్ణయం తీసుకోవాలి. గడువు పొడిగించిన ప్రాంతాల్లో సవరించిన నోటిఫికేషన్ ఇచ్చి, ప్రకటన చేసిన సమయం నుంచి కనీసం 48 గంటల పాటు అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు తగిన సమయం కల్పించాలని ఆదేశించింది.

డీజీపీకి సీరియస్ ఆదేశాలు
నామినేషన్లు వేయడానికి వచ్చే వైసీపీ అభ్యర్థులకు పక్కాగా పోలీసు రక్షణ కల్పించాలని రాష్ట్ర డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీ నిఘా ఏర్పాటు చేయాలని, అభ్యర్థులు భయం లేకుండా నామినేషన్లు వేసేలా తీసుకున్న చర్యలపై డీజీపీ నేరుగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.

అక్టోబర్ 27న తదుపరి విచారణ
ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసి, ఏకపక్షంగా ఏకగ్రీవాలు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలనుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్లాన్లకు సుప్రీంకోర్టు తీర్పుతో కోలుకోలేని దెబ్బ తగిలిందని వైసీపీ అభిప్రాయం వ్య‌క్తం చేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములైన అందరికీ సమాన అవకాశాలు కల్పించి, స్వేచ్ఛాయుత వాతావరణం పునరుద్ధరించడంపై ఎస్ఈసీ, డీజీపీలు ఇచ్చే నివేదిక ఆధారంగా అక్టోబర్ 27న సుప్రీంకోర్టు ఈ కేసును తిరిగి విచారించనుంది.

అధికార బలంతో కూటమి నాయ‌కులకు, వారికి వత్తాసు పలికిన పోలీసు అధికారులకు ఈ తీర్పు చెంప‌పెట్టు లాంటిద‌ని వైసీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment