ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాక్అప్ డెత్ ఉదంతంలో చంద్రబాబు ప్రభుత్వానికి హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఏపీ హైకోర్టు.. ఈ కేసు విచారణను ప్రతిష్టాత్మక సీబీఐకి (CBI) అప్పగిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. సాయికృష్ణ కుటుంబ సభ్యులు దాఖలు చేసిన పిటిషన్పై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం.. మృతుడి తల్లి విజయలక్ష్మికి రూ. 25 లక్షల పరిహారాన్ని నాలుగు వారాల్లోపు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తొక్కిపెట్టిన అధికారుల డొంక కదులుతుందా..?
సాయికృష్ణ మృతి కేవలం సాధారణ సంఘటన కాదని, పోలీసుల అరాచకానికి, లాకప్ హింసకు బలైన ఉదంతమని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది. ఈ కేసును ప్రారంభం నుంచే నీరుగార్చాలని, అసలు నిజాలు బయటికి రాకుండా తొక్కిపెట్టాలని చూసిన పెద్ద తలకాయల డొంకంతా ఇప్పుడు సీబీఐ విచారణతో కదలడం ఖాయంగా కనిపిస్తోంది.
విజయవాడ సీపీ రాజశేఖరబాబుపై ఇప్పటికే వైసీపీ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లాక్అప్ డెత్ ఉదంతాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన ఉన్నతాధికారుల పాత్రపై సీబీఐ విచారణతో అసలు నిజాలు నిగ్గుతేలనున్నాయి. ఈ కేసును విచారించడానికి తమకేమీ అభ్యంతరం లేదని సీబీఐ కోర్టుకు తెలపడంతో, దర్యాప్తు వేగవంతం కానుంది.
పెద్ద తలకాయలు ఇరుక్కోక తప్పదు!
లాక్అప్ డెత్ను కప్పిపుచ్చి, బాధ్యులైన పోలీసులను కాపాడాలని చూసిన ప్రభుత్వ ప్రయత్నాలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిదని రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. కేసును సీబీఐకి అప్పగించడాన్ని సాయికృష్ణ కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు స్వాగతిస్తున్నాయి. ఈ దర్యాప్తులో ఎంతటి బడా నాయకులు, ఉన్నతాధికారులు ఉన్నప్పటికీ చట్టం ముందు దోషులుగా నిలబడి శిక్ష అనుభవించడం తథ్యమని, త్వరలోనే తెరవెనుక ఉన్న పెద్ద తలకాయలన్నీ కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమని స్పష్టమవుతోంది.








