ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ (Singareni Collieries Company Limited – SCCL) తీవ్ర నష్టాల్లోకి జారుకుంటోందని, దాని గ్రాఫ్ (Graph) క్రమంగా పడిపోతోందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14న రామగుండంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ సభకు ‘సింగరేణి కార్మిక గర్జన’గా(Singareni Karmika Garjana) నామకరణం చేశామని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో బొగ్గు ఉత్పత్తి పతనం
కాంగ్రెస్ సర్కార్ వచ్చినప్పటి నుంచి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని హరీశ్ రావు విమర్శించారు. సుమారు 12 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి తగ్గడమే కాకుండా, నష్టాల్లేని లాభాల బాటలో నడిచే సింగరేణిని కాంగ్రెస్ నాయకులు ‘అవినీతి ఘని’గా(Den of Corruption) మార్చారని ఆరోపించారు. రూ.6,300 కోట్ల లాభాలు బ్యాంకుల్లో డిపాజిట్ ఉన్నప్పటికీ, కార్మికులకు జీతాలు చెల్లించేందుకు ఓవర్‌డ్రాఫ్ట్ (OD) తీసుకోవాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దసరా పండుగ లాభాల వాటా ఏది?
ప్రతి ఏటా దసరా పండుగకు (Dussehra Festival) ముందే సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోందని, కానీ రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకు దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయమన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో (KCR Government) కార్మికులకు గరిష్టంగా 33 శాతం లాభాల వాటా ఇచ్చామని గుర్తుచేసిన హరీశ్ రావు.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ఏడాది 16 శాతం, రెండవ ఏడాది 12.5 శాతానికి తగ్గించి కార్మికుల కడుపు కొట్టిందని మండిపడ్డారు.
జివో 76, నిబంధనలపై కాంగ్రెస్ కుట్రలు
కార్మికుల ఇళ్ల స్థలాల (Workers’ House Plots) క్రమబద్ధీకరణకు(Regularisation) సంబంధించి జీవో 76ను 2019లోనే కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిందని స్పష్టం చేశారు. అయితే, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) ఈ జీవోను వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhara Reddy) ఇచ్చారని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు భూములను నిషేధిత జాబితాలో పెట్టి కార్మికుల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపించారు.
- ప్రధాన డిమాండ్లు
- వెంటనే మెడికల్ బోర్డును ఏర్పాటు చేసి, కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలి.
- దసరా కానుకగా సింగరేణి లాభాల్లో కార్మికుల వాటాను తక్షణమే ప్రకటించాలి.
- నిలిచిపోయిన కార్మిక సంఘాల ఎన్నికలను వెంటనే నిర్వహించాలి.
- ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
- కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ కుట్రలు ఆపి, సింగరేణికి నామినేట్ పద్ధతిలో బొగ్గు గనులను కేటాయించాలి.
- సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, ఈ అన్యాయాలపై సింగరేణి కార్మికులందరూ ఐక్యంగా పోరాడి ‘సింగరేణి కార్మిక గర్జన’ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.








