‘అగ్గిపెట్టె మచ్చ’ కన్నుమూత!

‘అగ్గిపెట్టె మచ్చ’ కన్నుమూత!

Summarize with AI

తనదైన కామెడీ శైలి, విలక్షణమైన మేనరిజమ్స్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్ ‘అగ్గిపెట్టె మచ్చ’(Aggipette Maccha) (కిరణ్ కుమార్) (Kiran Kumar)ఇకలేరు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, తిరుపతిలోని స్విమ్స్ (SVIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మృతితో సోషల్ మీడియా షాక్‌కు గురైంది.

తిరుపతికి(Tirupati) చెందిన కిరణ్ కుమార్ (Kiran Kumar) తీవ్ర అనారోగ్య సమస్యలతో ఈనెల‌ 5న స్విమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందించారు. అయినప్పటికీ పరిస్థితి క్షీణించడంతో బుధవారం ఆయన చివరి శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు.

యూట్యూబ్(YouTube), ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికలుగా కిరణ్ కుమార్ చెప్పే మాస్ డైలాగులు, ఆయన ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకునేవి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆయన వీడియోలు, మీమ్స్ హల్‌చల్ చేసేవి. సినిమా సెలబ్రిటీలతో సమానంగా ఆయనకు భారీ సంఖ్యలో అభిమానులు ఏర్పడ్డారు. ఒకానొక దశలో డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్లు ఆయన ఇంటర్వ్యూల కోసం క్యూ కట్టేంతగా ప్రజాదరణ పొందేలా ‘అగ్గిపెట్టె మచ్చ’ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.

కొంతకాలంగా ఆయన సోషల్ మీడియాకు దూరంగా ఉంటుండగా, ఉన్నట్లుండి ఆయన మరణవార్త వినడంతో అభిమానులు, నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. కిరణ్ కుమార్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ పలువురు ప్రముఖ యూట్యూబర్లు, డిజిటల్ క్రియేటర్లు, నెటిజన్లు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment