కేరళలో(Kerala) ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థిరువోణం బంపర్ లాటరీ (Thiruvonam Bumper Lottery) (BR-111) డ్రా నేడు జరగనుంది. సెప్టెంబర్ 26న సాయంత్రం తిరువనంతపురంలోని(Thiruvananthapuram) గోర్ఖీ భవన్లో(Gorky Bhavan) డ్రా నిర్వహించనున్నారు. ఈసారి తొలి బహుమతిని ఏకంగా రూ.30 కోట్లకు పెంచడంతో లాటరీపై (Lottery) ఆసక్తి మరింత పెరిగింది. గతంలో రూ.25 కోట్లుగా ఉన్న తొలి బహుమతిని (First Prize) ఈ ఏడాది రూ.30 కోట్లకు పెంచారు. జూలై 20 నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభం కాగా.. రూ.500 విలువైన మొత్తం 90 లక్షల టికెట్లను ముద్రించారు. వీటిలో 89.85 లక్షల టికెట్లు విక్రయమైనట్లు కేరళ రాష్ట్ర లాటరీ శాఖ (Kerala State Lotteries Department) వెల్లడించింది.
BR-111లో ఒక్క తొలి బహుమతే కాదు.. మరెన్నో భారీ నగదు బహుమతులు విజేతలను వరించనున్నాయి. తొలి బహుమతి రూ.30 కోట్లు కాగా, రెండో బహుమతిగా 20 సిరీస్‌లలో ఒక్కో సిరీస్‌కు ఇద్దరు విజేతలకు రూ.1 కోటి చొప్పున అందనుంది. మూడో బహుమతిగా 20 మందికి రూ.25 లక్షల చొప్పున, నాలుగో బహుమతిగా 10 మందికి రూ.5 లక్షల చొప్పున, ఐదో బహుమతిగా 10 మందికి రూ.2 లక్షల చొప్పున ఇవ్వనున్నారు. దీంతో పాటు రూ.5 వేలు, రూ.2 వేలు, రూ.1,000, రూ.500 విలువైన మరిన్ని బహుమతులు కూడా ఉన్నాయి. దీంతో తమ టికెట్ నంబర్ ఏమైనా అదృష్టాన్ని మార్చేస్తుందా? అంటూ వేలాది మంది ఉత్కంఠగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
డ్రా పూర్తైన తర్వాత థిరువోణం బంపర్ ఫలితాలను(Thiruvonam Bumper Results) కేరళ రాష్ట్ర లాటరీ అధికారిక యూట్యూబ్ ఛానల్(Official YouTube Channel), అధికారిక లాటరీ పోర్టల్‌లో(Official Lottery Portal) పరిశీలించవచ్చు. టికెట్ నంబర్ సరిపోలిన విజేతలు ఫలితాలను అధికారికంగా ధృవీకరించుకున్న అనంతరం, బహుమతి పొందేందుకు అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలి. విజేతలు ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు తమ ఒరిజినల్ టికెట్‌తో పాటు అవసరమైన గుర్తింపు పత్రాలను సమర్పించి బహుమతిని క్లెయిమ్ చేసుకోవాలి. మరి ఈసారి రూ.30 కోట్ల అదృష్టం ఎవరి తలుపు తడుతుందో తెలియాలంటే మరికొద్ది సమయం వేచి చూడాల్సిందే!








