లేడీ సూపర్‌స్టార్ నయనతార(Nayanthara), యువ హీరో కవిన్ (Kavin) జంటగా నటించిన విభిన్న రొమాంటిక్ డ్రామా ‘హాయ్’(Hi) ఇప్పుడు ఓటీటీలో(OTT) సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో(ZEE5) నేటి నుంచి ఈ చిత్రం తమిళంలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఆధునిక ప్రేమ, రిలేషన్షిప్లలోని సంక్లిష్టతలు, కుటుంబం నుంచి వచ్చే ఒత్తిళ్లను సహజంగా చూపించిన ఈ సినిమా.. తనకు ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించే ఓ యువతి, అనుకోకుండా ఓ యువకుడిని కలిసిన తర్వాత వారి జీవితంలో చోటుచేసుకునే పరిణామాల చుట్టూ సాగుతుంది. బయటికి ఎంతో ధైర్యంగా కనిపించినా లోపల ఎన్నో భయాలు, సంఘర్షణలు మోసే యువతిగా నయనతార నటన ఆకట్టుకుంటుందని చిత్రబృందం చెబుతోంది.
ఇక కవిన్ పాత్ర కూడా కథలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. తన భావోద్వేగాలను దాచుకోకుండా వ్యక్తం చేసే యువకుడిగా ఆయన కనిపించనున్నారు. ఎన్నో తిరస్కరణలు ఎదురైనా నిజమైన ప్రేమ కోసం ఎదురుచూసే వ్యక్తిగా కవిన్ పాత్రను దర్శకుడు విష్ణు ఎడవన్ తీర్చిదిద్దారు. రాధికా శరత్‌కుమార్, ప్రభు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇటీవల కన్నుమూసిన దిగ్గజ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్(K. Bhagyaraj) తెరపై కనిపించిన చివరి చిత్రాల్లో ‘హాయ్’ కూడా ఒకటి కావడం గమనార్హం. దీంతో ప్రేమ, బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.








