పోలీసుల వల్లే గుండెపోటు.. ఇది ప్రభుత్వ హత్యే..!

పోలీసుల వల్లే గుండెపోటు.. ఇది ప్రభుత్వ హత్యే..!

Summarize with AI

వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు, మాజీ లిడ్‌క్యాప్ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్ అకాల మృతి చ‌ర్చ‌నీయాంశంగా మారింది. విజ‌య‌వాడ‌ శాప్ (SAAP) కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను పోలీసులు అత్యంత దారుణంగా ఉక్కిరిబిక్కిరి చేయడం వల్లే గుండెపోటు వచ్చి మరణించారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

డీఎస్సీ అక్రమాలపై ఈనెల 21న‌ విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద వైసీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో కాకుమాను రాజశేఖర్ చురుగ్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన అనుచరులు, పార్టీ నేతలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ధర్నా సమయంలో పోలీసులు రాజశేఖర్‌ను ఐదుసార్లు తోసేయడంతో ఆయన కిందపడిపోయారు. పోలీసులు వారి మోచేతులతో రాజశేఖర్ ఛాతి భాగంలో బలంగా నొక్కి తీవ్రంగా ఇబ్బంది పెట్టారని చెబుతున్నారు. శాప్ ఆఫీస్ వద్ద పోలీసులు రాజశేఖర్‌పై దౌర్జన్యం చేసిన దృశ్యాలు, ఆయనను ఉక్కిరిబిక్కిరి చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

దాదాపు ఐదుసార్లు పోలీసుల తోపులాట‌లో కింద‌ప‌డిపోయిన కాకుమాను రాజ‌శేఖ‌ర్‌.. ధర్నా ముగిసిన వెంటనే తీవ్ర అస్వస్థతతో విజయవాడలో హెల్త్ చెకప్ చేయించుకున్నారు. పోలీసులు ఛాతిపై బలంగా నొక్కినప్పటి నుంచి ఆయనకు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని, దీనికి సంబంధించిన ఆసుపత్రి వైద్య పరీక్షల ఫోటోలను కూడా ఆయన అనుచరులు మీడియాకు విడుదల చేశారు. ధర్నా అనంతరం హైదరాబాద్ వెళ్లిన ఆయ‌న, పోలీసుల ఒత్తిడి, భౌతిక దాడికి గురై గుండెపోటుతో కన్నుమూశారని వారు ఆరోపిస్తున్నారు.

ఒంగోలులోని కాకుమాను రాజశేఖర్ భౌతికకాయానికి వైసీపీ ముఖ్య నేతలు, శ్రేణులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాజశేఖర్ గుండెలపై పదే పదే నొక్కి, కిందపడేసి క్రూరంగా ప్రవర్తించడం వ‌ల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని, ఇది సహజ మరణం కాదు.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీసుల దాష్టీకం చేసిన ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేన‌ని ఆరోపిస్తున్నారు.

శాంతియుత ధర్నాల్లో పాల్గొనే నాయకులపై పోలీసులు ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టని, రాజశేఖర్ మృతికి బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment