ఒక్కరోజు షెడ్యూల్‌లోనే అనేక కార్య‌క్ర‌మాలు ర‌ద్దు!

ఒక్కరోజు షెడ్యూల్‌లోనే అనేక కార్య‌క్ర‌మాలు ర‌ద్దు

Summarize with AI

నెలరోజుల విరామం తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు తిరిగొచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో నిర్వహించిన పర్యటనలో ప్రకటించిన పూర్తి షెడ్యూల్‌ను కూడా కొనసాగించలేకపోయారు. రూ.1,500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు అంటూ జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేసినప్పటికీ.. వాటిని పూర్తిచేసే ఓపిక లేకపోవడంతో అనేక కార్యక్రమాలు రద్దయ్యాయి.

కేరళం నుంచి పిఠాపురానికి..
జూలై 10న జనసేన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల సమావేశంలో పాల్గొన్న పవన్ కల్యాణ్.. అదే రోజు ముంబైకి వెళ్లి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఐదురోజుల త‌రువాత డిశ్చార్జ్ అయ్యి హైదరాబాద్‌లోని త‌న నివాసానికి చేరుకొని విశ్రాంతి తీసుకున్నారు. ఏపీకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ పాల్గొన్న భోగాపురం ఎయిర్‌పోర్టు అధికారిక కార్యక్రమానికి మిన‌హా మిగ‌తా ఏ కార్య‌క్ర‌మానికి హాజ‌రుకాలేదు.. చివ‌ర‌కు కేబినెట్ స‌మావేశాల‌కు సైతం డుమ్మా కొట్టారు. ఆ తర్వాత ఆగస్టు 22న ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లిన పవన్ కల్యాణ్.. నెలరోజుల విరామం అనంతరం సెప్టెంబర్ 21న పిఠాపురంలో ప్ర‌త్య‌క్షమ‌య్యారు.

పర్యటనలో కీలక కార్యక్రమాలు రద్దు
పిఠాపురం మండలం ఫకృద్దీన్‌పాలెంలోని మైసమ్మ చెరువును, పట్టణంలోని పీఠికాపుర వనాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి వెళ్లారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం కొత్తపల్లి మండలం కొండెవరం, నాగులపల్లిలోని సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు వారం రోజులుగా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ, ఆ కార్యక్రమాలు జరగలేదు.

ఇనుప కంచెలు.. గొడుగు నీడలో పర్యటన
ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన ఇనుప కంచెల మధ్య, గొడుగుల నీడలో, కూలింగ్ గ్లాసుల మాటున సాగింది. దీంతో ఆయన పర్యటన సినిమా షూటింగ్‌ను తలపించిందనే చర్చ నియోజకవర్గంలో కనిపించింది. పవన్‌కు వినతిపత్రాలు అందించేందుకు పలువురు వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చిన తల్లిదండ్రులు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం బయట గంటల తరబడి వేచి ఉన్నారు. అయినప్పటికీ వారిని పవన్ కల్యాణ్ కలవలేదు.

స్థానిక నాయకుల్లో అసంతృప్తి
చాలా కాలం తర్వాత పవన్ కల్యాణ్ పిఠాపురం రావడంతో జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయన పర్యటన కోసం ఎదురుచూశారు. అయితే పర్యటనలో స్థానిక నాయకులు, కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కలేదనే అసంతృప్తి వ్యక్తమైంది. ఎన్నికల తర్వాత పార్టీలో చేరినవారికి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులకు ఎక్కువ ప్రాధాన్యం దక్కిందని స్థానిక నాయకులు భావించారు. దీంతో పలువురు అసంతృప్తితో వెనుదిరిగారు.

ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ సైతం దూరం
పిఠాపురంలో పవన్ కల్యాణ్ విజయం కోసం తన సీటును త్యాగం చేసి గెలుపున‌కు సహకరించిన టీడీపీ నాయకుడు ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ కూడా ఈ పర్యటనకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. పవన్ కల్యాణ్ నియోజకవర్గ పర్యటనలో స్థానిక నాయకత్వానికి ప్రాధాన్యం లేకపోవడం, ముందుగా ప్రకటించిన కార్యక్రమాల్లో పాల్గొన‌క‌పోవ‌డం, పవన్‌ను కలిసేందుకు వచ్చిన ప్రజలు గంటల తరబడి వేచి ఉండటం వంటి పరిణామాలు పిఠాపురం రాజకీయాల్లో చర్చకు దారితీశాయి.

నెలరోజుల విరామం తర్వాత పిఠాపురంలో పవన్ కల్యాణ్ పర్యటన సాగినా.. తొలిరోజు పూర్తి షెడ్యూల్ అమలు కాకపోవడం, పలు కార్యక్రమాలు రద్దు కావడం, స్థానిక నాయకులు, కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం దక్కకపోవడం పర్యటనలో ప్రధానంగా కనిపించిన అంశాలుగా నిలిచాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment