ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఉన్నది కేవలం ‘ఎల్‌నినో ఎఫెక్ట్’ కాదని.. ప్రభుత్వ చర్యల లోపంతో వచ్చిన ఎల్లో నినో ఎఫెక్ట్ కరవు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రరాష్ట్రంలో కరవు పరిస్థితులపై వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్.. జిల్లాల వారీగా పరిస్థితులను సమీక్షించారు.
628 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు
సెప్టెంబర్ 16 వరకు ఖరీఫ్ ప్రారంభం నుంచి రాష్ట్రంలో 51 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైంది. 28 జిల్లాల్లోనూ వర్షపాతం లోటు ఉందని, 688 మండలాల్లో 628 మండలాలు వర్షాభావ పరిస్థితుల్లో ఉన్నాయని మాజీ సీఎం జగన్ చెప్పారు. వీటిలో సుమారు 332 మండలాల్లో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. అన్నమయ్యలో 75 శాతం, సత్యసాయి 66 శాతం, ప్రకాశం 65 శాతం, చిత్తూరు 58.5 శాతం, వైఎస్సార్ కడప, తూర్పుగోదావరిలో 57 శాతం చొప్పున లోటు ఉందని పేర్కొన్నారు.
ముందే తెలిసినా కార్యాచరణ లేదు
ఎల్‌నినో ప్రభావం ఉంటుందని ఫిబ్రవరి 4నే చంద్రబాబు చెప్పారని జగన్ గుర్తుచేశారు. అయినప్పటికీ ముందస్తు కార్యాచరణ చేపట్టలేదని ఆరోపించారు. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా వర్షపాతం లోటు ఉన్నప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. ప్రభుత్వ ప్రకటనలను నమ్మి సాగులోకి దిగిన రైతులు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోతున్నారని చెప్పారు. ఈ ఏడాది సాధారణంగా 76 లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉండగా.. 56.4 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరిగిందని జగన్ పేర్కొన్నారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో విత్తనం కూడా పడలేదన్నారు.
ఉచిత పంటల బీమాపై డిమాండ్
ఉచిత పంటల బీమా అమల్లో ఉంటే సాగు చేయలేని రైతులకు ‘ప్రివెంటివ్ సోయింగ్’ కింద ఎకరాకు కనీసం రూ.15 వేల పరిహారం వచ్చేదని జగన్ అన్నారు. సాగు చేసిన పంటలకు ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బీమా పరిహారం అందేదన్నారు. 2022–23 ఖరీఫ్‌లో ఏపీలో 1.18 కోట్ల పంటల బీమా దరఖాస్తులు ఉండగా.. 2026–27 ఖరీఫ్‌లో ఆ సంఖ్య 40 లక్షలకు పరిమితమైందని పార్లమెంట్‌లో కేంద్రం వెల్లడించినట్లు జగన్ తెలిపారు. 2023 ఖరీఫ్‌కు సంబంధించిన రాష్ట్ర వాటా ప్రీమియం రూ.1,400 కోట్లు చెల్లించి ఉంటే రైతులకు సుమారు రూ.3 వేల కోట్ల మేర ప్రయోజనం కలిగేదన్నారు.
శ్రీశైలం నీటిపైనా..
శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 862 అడుగులకు పడిపోయిందని జగన్ అన్నారు. 880 అడుగుల వద్ద ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తి సామర్థ్యంతో నీటిని తీసుకునే అవకాశం ఉంటుందని, 854 అడుగులకు చేరితే సుమారు 6 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే తీసుకునే పరిస్థితి ఉంటుందని వివరించారు. రాయలసీమలోని రిజర్వాయర్లు కూడా డెడ్ స్టోరేజీకి చేరువయ్యాయని చెప్పారు. పులిచింతల ఎగువ, దిగువ ప్రాంతాల్లో తెలంగాణ ప్రభుత్వం లిఫ్ట్‌లు నిర్మిస్తూ నీటిని తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం స్పందించడం లేదని జగన్ ఆరోపించారు.
పోలవరం ఎత్తుపై అభ్యంతరం
పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తున్నారని జగన్ ఆరోపించారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందని, దాదాపు 75 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. పుష్కర, పురుషోత్తపట్నం లిఫ్ట్‌ల ద్వారా గోదావరి నీటిని తరలించడాన్ని కూడా ఆయన విమర్శించారు.
కరవు మండలాలు ప్రకటించాలని డిమాండ్
జూన్‌లో 25 శాతం, జూలైలో 66 శాతం, ఆగస్టులో 55 శాతం వర్షపాతం లోటు ఉన్నప్పటికీ కరవు మండలాలను ఎందుకు ప్రకటించలేదని జగన్ ప్రశ్నించారు. కర్ణాటక ఆగస్టు 28నే కరవు ప్రాంతాలను ప్రకటించిందని ప్రస్తావించారు. కరవు మండలాల ప్రకటనతో రుణాల రీషెడ్యూల్, పంటల బీమా క్లెయిమ్‌లు వంటి ప్రయోజనాలు రైతులకు అందుతాయని చెప్పారు. కరవు మండలాలను ప్రకటించకపోవడానికి ఇన్‌పుట్ సబ్సిడీ భారం కూడా కారణమై ఉండొచ్చని జగన్ ఆరోపించారు. 56 లక్షల ఎకరాలకు లెక్కిస్తే ఇన్‌పుట్ సబ్సిడీ దాదాపు రూ.6 వేల కోట్లు అవుతుందని పేర్కొన్నారు.
రైతులకు తక్షణ సాయం చేయాలి
కరవు పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ విత్తనాలు, పశుగ్రాసం అందుబాటులోకి తేవాలని జగన్ డిమాండ్ చేశారు. వ్యవసాయ పనులు లేక వలసలు పెరుగుతున్నందున అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు అదనంగా 150 రోజుల ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. అన్నదాత సుఖీభవ కింద మూడేళ్లకు రైతులకు ఇవ్వాల్సిన రూ.60 వేలలో రూ.19 వేలు మాత్రమే ఇచ్చారని, మిగిలిన రూ.41 వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేయాలని కోరారు.
మోంథా తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు రూ.846 కోట్లు విడుదల చేయాలని, కరవు ప్రభావిత సాగుకు సుమారు రూ.6 వేల కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని, రైతులకు సున్నా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
పశుగ్రాసం, విద్యుత్, విద్యా బకాయిలపై కూడా
కరవు ప్రభావంతో పశుగ్రాసం కొనలేని పరిస్థితిలో ఉన్న రైతులకు ఉచితంగా పశుగ్రాసం అందించాలని జగన్ కోరారు. రైతుల పిల్లలకు సంబంధించిన విద్యాదీవెన, వసతిదీవెన బకాయిలు దాదాపు రూ.9 వేల కోట్లు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ఉచిత ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని, గ్రామాల్లో విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేయాలని కోరారు. కరవు కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.7 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, ఎండిపోతున్న పండ్ల తోటలను కాపాడేందుకు 80 శాతం సబ్సిడీతో నీటి ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని వెల్లడి
రైతుల సమస్యలపై మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని జగన్ పార్టీ నేతలకు సూచించారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. అవసరాన్ని బట్టి తాను కూడా కార్యక్రమాల్లో పాల్గొంటానని వెల్లడించారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు.








